ఆర్మూర్‌టౌన్: పట్టణ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వెంకట సుబ్బయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆల్లూర్ మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం ఆర్మూర్‌కు వచ్చాడు. ఇక్కడే కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
మెకానిక్ నిర్లక్ష్యం.. ట్రాక్టర్ యజమాని ..
భిక్కనూరు : మెకానిక్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ యజమాని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని మంగిలిపల్లి రమేశ్(52) ట్రాక్టర్ మరమ్మతులు చేసేందుకు కామారెడ్డికి చెందిన మెకానిక్ రియాన్‌ను పిలిపించాడు. దీంతో రియాన్ వచ్చి ట్రాక్టర్‌ను రిపేర్ చేస్తుండగా యజమాని రమేశ్ ట్రాక్టర్ ఎదుట నిల్చున్నాడు. ఆ సమయంలో రియాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫ్ ద్వారా స్టార్టు చేయగానే ట్రాక్టర్ ముందుకు వెళ్లి రమేశ్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను కామారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహామేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. రమేశ్ మృతికి కారణమైన మెకానిక్ రియాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కరెంట్ షాక్‌తో గేదె ..
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ గ్రామ శివారులోని ఎస్‌ఎస్ 5 ట్రాన్స్‌ఫార్మర్ వద్ద గురువారం కరెంట్ షాక్‌తో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన తోట రవీందర్ పాడి గేదె మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. పొలం గట్టు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతుకు రూ. 55 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు పేర్కొన్నారు.


