● సాక్షి కథనానికి సీఎంవో స్పందన
మద్నూర్(జుక్కల్): సాక్షి దిన పత్రికలో గురువారం ప్రచురితమైన ‘చిమ్మ చీకట్లో సర్కార్ దవాఖానా’ అనే వార్తకు సీఎంవో కార్యాలయం స్పందించింది. ఈ విషయమై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సీఎంవో నుంచి సమాచారం అందింది. గురువారం డీసీహెచ్ విజయ్‌భాస్కర్ మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్‌జాదవ్‌ను వివరణ కోరారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఇన్వర్టర్ నుంచి ఆస్పత్రిలోని వార్డుకు కలిపే విద్యుత్ వైరింగ్‌లో మరమ్మతులు ఉండటంతో ఆస్పత్రిలో అంధకారం నెలకొందని, వెంటనే అదే రాత్రి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి మరమ్మతులు చేపించినట్లు వైద్య అధికారుల ద్వారా తెలిసింది.
బాన్సువాడ రూరల్: గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని దేశాయిపేట్ గ్రామ సర్పంచ్ భూనేకర్ జ్యోతి ప్రకాష్ కోరారు. గురువారం గ్రామపంచాయతీలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి గీత గ్రామసభ ఉద్దేశాలను వివరించారు. గ్రామంలో మురుగు కాల్వల పరిశుభ్రత, వీధిదీపాల నిర్వాహణ, తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ జ్యోతి అన్నారు.
బాన్సువాడ రూరల్: బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బోర్లం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపి కోరారు. గురువారం ఆయన గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలలపై మోజును వీడి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు అయ్యాల సంతోష్, సత్యనారాయణ, చైతన్య తదితరులు ఉన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎన్ని అడ్డంకులు వచ్చినా విద్యార్థుల కోసం బాత్‌రూములను నిర్మిస్తామని సర్పంచ్ నరేశ్ అన్నారు. దేవాయిపల్లిలో గురువారం ఆయన గ్రామస్తులతో కలసి మాట్లాడారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు పాఠశాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న బాత్‌రూము పనులను అడ్డుకుంటున్నారన్నారు. విద్యార్థుల ఆట స్థలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాలక వర్గం, గ్రామస్తుల తీర్మానం మేరకే పనులను చేపట్టినట్లు తెలిపారు.


