అవినీతికి కేరాఫ్‌ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

అవినీతికి కేరాఫ్‌ కాంగ్రెస్‌

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

సీఎం, మంత్రులందరిదీ అదేబాట

సభ్యత్వ నమోదును

విజయవంతం చేయాలి

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి క్రైం : అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎంతోపాటు మంత్రులందరిదీ అదేబాట అన్నారు. గురువారం కామారెడ్డిలోని వెలమ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 14 వేల ఎకరాలు సేకరించి పెడితే రేవంత్‌ సర్కారు ఫోర్త్‌సిటీ పేరిట భూములను ప్రైవేటు వారికి అమ్ముకునే పనిలో పడిందన్నారు. మిల్లర్లతో కలిసి రూ.వెయ్యి కోట్లు, ఎకై ్సజ్‌లో రూ.600 కోట్లు, మంచిర్యాలలో 116 ఎకరాల దేవాదాయశాఖ భూములు, సింగరేణి భూముల కుంభకోణాలకు ఆయా మంత్రులు తెరలేపారని ఆరోపించారు. కొత్తగా రైతు డిస్కం పేరుతో మరో అవినీతితో ముందుకువచ్చారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసే కుట్రలను బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటుందన్నారు.

హామీల అమలు నిరూపిస్తే..

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. రైతుబంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో రైతులు గమనిస్తున్నారన్నారు. 2023 అక్టోబర్‌లో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అభివృద్ధి పనులకు రూ.8 కోట్లతో తాను శిలాఫలకం వేశానన్నారు. ఇప్పుడు తాము మంజూరు చేసినట్లు కాంగ్రెస్‌ నాయకులు అక్కడ మళ్లీ ఫొటోలు దిగుతున్నారన్నారు. మున్సిపాటిలీలో సీసీ రోడ్లకు తాను రూ.23 కోట్లు తీసుకువస్తే ఇప్పుడు తాము మంజూరు చేసినట్లు అధికార పార్టీ నేతలు శంకుస్థాపనలు చేసుకుంటున్నారన్నారు. గతేడాది వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి పరిశీలించారని, ధ్వంసమైన అన్ని బ్రిడ్జీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను 15 రోజుల్లో చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ కనీస మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, హన్మంత్‌ సింధే, బాజిరెడ్డి గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, నాయకులు ముజీబొద్దీన్‌, ప్రభాకర్‌రెడ్డి, సుమిత్రానంద్‌, ప్రేమ్‌కుమార్‌, ప్రభాకర్‌ యాదవ్‌, కుంబాల రవి, లక్ష్మీనారాయణ, బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చేతగాని ప్రభుత్వం..

ఇదొక చేతగాని ప్రభుత్వమంటూ రేవంత్‌ సర్కారుపై మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, అందుకే కాంగ్రెస్‌ పేరు చెబితేనే ఛీకొడుతున్నారన్నారు. చేతగాని సీఎంగా రేవంత్‌ చరిత్రలో నిలిచిపోతాడన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement