నేడు బల్దియా సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు బల్దియా సమావేశం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి బల్దియా సాధారణ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన నిర్వహించనున్నారు. మున్సిపల్‌ అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించి 17 అంశాలతో రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించనున్నారు.

ఇతర అంశాలు..

పట్టణంలో నీటి సరఫరా నిర్వహణ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రెయినేజీలలో పూడికతీత, పొక్లెయిన్‌ల కాంట్రాక్టులు, వీధి దీపాల కొనుగోలు, పార్కుల అభివృద్ధి వంటి పలు అత్యవసర ఇంజినీరింగ్‌ పనుల కోసం సిద్ధం చేసిన రూ. 1.28 కోట్ల అంచనాలకు పరిపాలనా అనుమతి కోరనున్నారు. అక్రమ కుళాయిలు, 2019లో మున్సిపాలిటీలో విలీనమైన 7 గ్రామ పంచాయతీల్లోని ఆన్‌లైన్‌ కాని నల్లా కనెక్షన్లను గుర్తించి, నెలకు రూ. 100 చొప్పున బిల్లు వసూలు చేస్తూ క్రమబద్ధీకరించే అంశంపై కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనుంది. కోతులను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టే ప్రత్యేక ఏజెన్సీ సేవలకు గాను రూ. 10 లక్షల సాధారణ నిధుల వ్యయానికి ఆమోదం తెలపనున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రూ. 3.71 కోట్ల కంపోస్ట్‌ ప్లాంట్‌ పనులు, రూ. 1.62 కోట్ల డీఆర్‌సీసీ పనులతో పాటు, రోజుకు 30–50 టన్నుల సామర్థ్యం గల వ్యర్థాల నిర్వహణ యంత్రాల సేకరణ అంశంపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ప్రారంభమయ్యే సమావేశానికి కౌన్సిల్‌ సభ్యులు హాజరు కావాలని చైర్‌పర్సన్‌ ఉమారాణి కోరారు.

శ్మశాన వాటిక అభివృద్ధికి..

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలోగల శ్మశాన వాటికలో కనీస వసతులు లేక అంతిమ సంస్కారాల నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ స్పందించి సొంత నిధులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. అనుమతులు ఇప్పించాలని ఫౌండేషన్‌ ప్రతినిధులు కోరగా.. దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులను కౌన్సిల్‌ ముందు ఉంచారు. ఎజెండా అంశంలో సైతం ‘సాక్షి’ పేరును పొందుపరిచారు. కౌన్సిల్‌ దీనిని ఆమోదించి ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌కు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నారు.

ఎజెండా అంశంగా ‘సాక్షి’ కథనం

వైకుంఠధామం అభివృద్ధి కోసం

స్వచ్ఛంద సంస్థకు అనుమతివ్వనున్న

కౌన్సిల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement