ఊసెత్తని ప్రభుత్వం..
ప్రభుత్వం ప్రోత్సహించాలి
ఇప్పటికీ మంజూరు చేయలేదు
లోన్
● జిల్లాలో యువ వికాసం పథకానికి
44,742 దరఖాస్తులు
● ఏడాది దాటినా
నిధులివ్వని సర్కారు
● నిరాశలో దరఖాస్తుదారులు
గతేడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని, తొలివిడతలో మొదటి రెండు కేటగిరీలకు ముందుగా నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పథకం ఊసే ఎత్తలేదు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పథకాన్ని పట్టాలెక్కించాలని కోరుతున్నారు.
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించింది. నాలుగు కేటగిరీల్లో చిన్నచిన్న వ్యాపారాలకు సంబంఽధించిన యూనిట్‌లు మంజూరు చేయడం కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మొదటి కేటగిరీ కింద రూ. 50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ, రెండో కేటగిరి కింద రూ.లక్ష యూనిట్‌కు 80 శాతం, మూడో కేటగిరీలో రూ. 2 లక్షల యూనిట్‌కు 70 శాతం, నాలుగో కేటగిరీలో రూ. 5 లక్షల యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ అందిస్తామని ప్రకటించింది. సబ్సిడీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాలు పొందాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తించాక తుది జాబితాను సిద్ధం చేసి గతేడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున యూనిట్‌లను మంజూరు చేస్తామని పాలకులు చెప్పడంతో నిరుద్యోగులు ఆశతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.
భారీగా దరఖాస్తులు..
రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లావ్యాప్తంగా మొత్తం 44,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 8,346, ఎస్టీ కార్పొరేషన్ 4,604, మైనారిటీ కార్పొరేషన్‌కు 6,880, ఓబీసీ కార్పొరేషన్‌కు 1,006, బీసీ కార్పొరేషన్‌కు 23,906 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు కేటగిరీలలో మొదటి రెండు కేటగిరీలకే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం.. దరఖాస్తుల స్వీకరణకే పరిమితమయ్యింది. నిధులు కేటాయించకపోవడంతో ఒక్కరికి కూడా పథకం ఫలాలు అందలేదు. ఈ పథకాన్ని ప్రకటించి ఏడాది దాటినా అడుగు ముందుకు పడకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు.
– కామారెడ్డి క్రైం
స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీపై రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే సంతోషించా. డెయిరీ ఫాం కోసం రూ.లక్ష యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నా. దరఖా స్తు చేసుకుని ఏడాది గడిచినా ఫలితం లేదు. యూనిట్‌లు మంజూరు చేసి యువతను ప్రోత్సహించాలి.
– శివకుమార్, గాంధారి
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా పాలకేంద్రం పెట్టుకోవడం కోసం రూ. 5 లక్షల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నా. నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికీ యూనిట్ మంజూరు కాలేదు. పాలకులు స్పందించి యూనిట్లు మంజూరు చేయాలి.
– సాయిబాబా, బాన్సువాడ


