బడి బాటను విజయవంతం చేయాలి
● రైతులకు ఇబ్బందులు
కలగకుండా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సదాశివనగర్: మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను ఈనెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన పద్మాజీవాడి, మోడెగాం గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పద్మాజీవాడి సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు 18,840 క్వింటాళ్ల మక్కలను సేకరించామన్నారు. ఇందులో 15వేల క్వింటాళ్లను గోదాంలకు తరలించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుబ్బారావు, గౌడెల్లి గంగాధర్, విండో చైర్మన్ గంగాధర్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, విండో సీఈవో దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: బడిబాటను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. బుధవారం హైదరాబాద్‌నుంచి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ అభినవ్ అభిలాష, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలిస్, హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలు కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బడి బాట, ప్రవేశాల ప్రత్యేక కార్యక్రమంపై చర్చించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భవిత కేంద్రాల బలోపేతం, కొత్త ప్రీప్రైమరీ విభాగాల ప్రారంభం, జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలల పునఃప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు, సెర్ప్ బృందాల ద్వారా యూనిఫాంల తయారీ, పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణతో పాటు రోజువారీ పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఈవో మల్లికార్జున్, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు.


