● స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా మార్చేందుకు
రూ. 9 కోట్లు మంజూరు
● మారనున్న ఇందిరాగాంధీ
స్టేడియం రూపురేఖలు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డిని క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని అత్యాధునిక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా మార్చేందుకు రూ. 9 కోట్లు మంజూరు చేసింది.
జిల్లాకేంద్రంలో ఐదెకరాల విస్తీర్ణంతో స్టేడియం ఉంది. దీనిని ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. దీనిని అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. యువతను వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడల వైపు మళ్లించాలనే సంకల్పంతో స్టేడియం అభివృద్ధికి రూ. 9 కోట్లు మంజూరు చేయించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి అదనంగా ఎకరం స్థలం కేటాయించేలా చూశారు. దీనికితోడు స్టేడియంలో డ్రెయినేజీ, మౌలిక వసతుల కల్పన కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ. కోటి విరాళాన్ని అందించింది. మొత్తం రూ. 10 కోట్ల నిధులతో స్టేడియాన్ని అభివృద్ధి చేయనున్నారు.
పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు..
ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిధిలోని పోలీస్ సిబ్బంది, అథ్లెట్లు తమ షూటింగ్, రన్నింగ్ ప్రాక్టీస్, అథ్లెటిక్ ఈవెంట్ల శిక్షణ కోసం హైదరాబాద్ లేదా వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని అభివృద్ధి చేశాక ఇక్కడే ఆయా అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి వీలుంటుందని భావిస్తున్నారు.
భవిష్యత్తులో కామారెడ్డి వేదికగా జాతీయ స్థాయి పోటీలతో పాటు టీ–20 క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేలా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సీఎంతో చర్చించి త్వరలోనే స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు. మల్టీపర్పస్ ఇండోర్ విభాగాల్లో అత్యాధునిక జిమ్, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, నాలుగు బ్మాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టు, యోగా హాల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అవుట్‌డోర్ క్రీడలైన క్రికెట్, వాలీబాల్, హాకీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్లడ్‌లైట్లను అమర్చనున్నారు. వాకింగ్, రన్నింగ్ కోసం ప్రత్యేకంగా 8 లేన్ల ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. స్టేడియం ఆవరణలో ఆధునిక స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించనున్నారు.


