బీబీపేట: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో పేరు వచ్చినప్పటికీ కొన్ని తప్పుల వల్ల ఆన్‌లైన్‌లో పేరు కనిపించడం లేదని, లిస్టులో నుంచి పేరు తొలగించడంతో ఆ కుటుంబం మొత్తం బీబీపేట నుంచి జిల్లా కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన ఎల్లమైన నందినికి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో లబ్ధిదారు అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఇల్లును కూల్చి ముగ్గు పోసుకున్నారు. తీరా చూశాక ఆన్‌లైన్‌లో నుంచి పేరు తొలగించారని, ఆన్‌లైన్‌లో పేరు కనిపించడం లేదని నిర్మాణానికి అధికారులు మంజూరు ఇవ్వలేదు. దీంతో బాధితులు కుటుంబంతో సహా అధికారుల చుట్టూ మూడు నెలలుగా తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతూ బుధవారం నందిని కుటుంబ సభ్యులు బీబీపేట నుంచి పాదయాత్రగా కలెక్టరేట్‌కు కాలినడకన బయల్దేరి వెళ్లారు. దోమకొండ వరకు పాదయాత్రగా వెళ్లగానే మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అదనపు కలెక్టర్ ఎన్‌వీ గిరి హుటాహుటిన బీబీపేటకు వచ్చి వివరాలు సేకరించారు. పాదయాత్రగా వెళ్తున్న కుటంబ సభ్యులను పిలిచి మంజూరు పత్రం అందించి ఇంటి నిర్మాణానికి స్థానిక ఎంపీడీవో పూర్ణచంద్రదోయకుమార్ చేతుల మీదుగా ముగ్గు పోయించారు. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధి పనుల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో ఉపాధి పనులను బుధవారం ఎంపీడీవో అనిత పరిశీలించారు. కొలతల ప్రకారంగా ఉపాధి పనులు చేస్తేనే కూలీలకు కూలీ గిట్టుబాటు అవుతుందన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్ జముల శంకర్, కూలీలు ఉన్నారు.
కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు బుధవారం గ్రామ సర్పంచ్ గొట్టం అనుసూజ చేతుల మీదుగా మజ్జిగ, చల్లని నీటిని అందజేశారు. ఉపాధి కూలీలు ఎండదెబ్బ బారిన పడకుండా మజ్జిగతో పాటు చల్లని నీటిని అందుబాటులో ఉంచామని సర్పంచ్ తెలిపారు. డీసీసీ కార్యదర్శి గొట్టం నర్సింలు, నాయకులు గొల్ల మల్లయ్య యాదవ్, పౌలు, గంగి చిన్ననారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
కోమట్‌పల్లి వీడీసీ అధ్యక్షుడిగా గంగారాం
లింగంపేట(ఎల్లారెడ్డి): కోమట్‌పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ) అధ్యక్షుడిగా వేల్పుల గంగారాంను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గంగమల్లు, కోశాధికారిగా బాల్‌రాజు, కమిటీ సభ్యులుగా శంకర్, కాశీరాం, గంగారాం, శ్రీధర్, రమేశ్‌గౌడ్, అల్లిరాజులను ఎన్నుకున్నట్లు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ సంఘం మండల కార్యవర్గం ఎన్నిక
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా కమ్మరి సిద్దిరాములుచారి(కొండాపూర్), ఉపాధ్యక్షులుగా కమ్మరి వెంకటిచారి, వడ్ల రాజుచారి, ప్రధాన కార్యదర్శిగా అవుసుల లక్ష్మణ్‌చారి, కోశాధికారిగా వడ్ల రాజేందర్‌చారి, కార్యదర్శిగా అవుసుల శ్రీనివాస్‌చారిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్ల భీమయ్యచారి, రవికుమార్, వెంకటేశం, పండరి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్తం


