బాన్సువాడ రూరల్: సాధారణ బదిలీల్లో భాగంగా బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బదిలీ కాగా వారి స్థానంలో ఇతర గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వచ్చి బుధవారం విధుల్లో చేరారు. బోర్లం పంచాయతీ కార్యదర్శిగా శివాజీ, రాంపూర్‌కు సాయిలు, ఇబ్రాహీంపేట్ తండాకు సాయికుమార్, తాడ్కోల్‌కు భరత్, కొల్లూర్‌కు రాఽధిక, కొత్తాబాదికి సృజన్‌రెడ్డి, సోమేశ్వర్ పంచాయతీకి పాల్త్య రవి, హన్మాజీపేట్‌కు భానుచందర్, కోనాపూర్ కార్యదర్శిగా రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే మండల కార్యాలయ సూపరింటెండెంట్‌గా భానుప్రకాష్, సీనియర్ అసిస్టెంట్‌గా సుభాషిణి బదిలీపై వచ్చినట్లు ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. సత్యనారాయణరెడ్డి ఇన్‌చార్జి ఎంపీవోగా కొనసాగుతారన్నారు.
బాన్సువాడ రూరల్: జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంగోజీపేట్ సర్పంచ్ సంగమేశ్వర్ అన్నారు. గ్రామస్తులతో కలిసి బుధవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక్కో రైతు వద్ద ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున ప్రభుత్వ మద్దతు ధర రూ.3,699 చొప్పున జొన్నలు కొనుగోలు చేస్తుందన్నారు. జొన్నలను దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దన్నారు. కాంటా చేసిన బస్తాలు తడవకుండా చూడాలన్నారు. సహకారశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు బుధవారం తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 40 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు సంపత్‌గౌడ్ సమక్షంలో చేరారు. వారికి ఆయన తన నివాసంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్‌సింగ్, బ్యాగరి సాయిలు, మహేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన రాజారాం అనిల్ కుమార్ ప్రమాదవశాత్తూ కుడి చేయిని కోల్పోయాడు. ఈ విషయం ప్రముఖ శాస్త్రవేత్త, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డికి వివరించగా ఆయన కృత్రిమ(ఫైబర్) చేతిని తయారు చేయించి బాధితుడికి అమర్చారు. దాంతో యువకుడు బైక్ నడపడంతో పాటు చిన్న చిన్న వస్తువులను పట్టుకునే విధంగా చేతిని అమర్చినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కృత్రిమ చేతికి అయ్యే ఖర్చును పైడి ఎల్లారెడ్డి భరించినట్లు తెలిపారు. మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్, సుభాష్, అనిల్, నరేష్ భగవాన్, రమేశ్, గణే ష్, తదితరులు పాల్గొన్నారు.
● జుక్కల్ ఎమ్మెల్యే
తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు, అధికారులు తమ వంతు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. సొంతిల్లు లేక ఇంటి స్థలం ఉన్న వారికి రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.


