ఎవరూ పట్టించుకోవడం లేదు
● ప్రమాదం జరగకముందే
సరి చేయాలని కోరుతున్న స్థానికులు
● పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
ఎల్లారెడ్డి: మండలంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ తీగలు చేతికందేలా వాలిపోయి ప్రాణాంతకంగా మారినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారు పొలాల్లో విద్యుత్ తీగలు చేతికందేలా జారాయి. ఈ కారణంగా పొలాల్లో పనిచేయడానికి రైతులు భయపడుతున్నారు. ట్రాక్టర్‌తో దున్నడానికి పొలంలోకి దిగితే వేలాడుతున్న తీగల కారణంగా ఒక మడి నుంచి వేరే మడికి వెళ్లడానికి ట్రాక్టర్ డ్రైవర్లు భయపడి దున్నకుండా వదిలి వెళ్లిపోతున్నారు. తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కల్యాణి ప్రాజెక్ట్ కట్ట గత సెప్టెంబర్‌లో తెగిపోయి, తిమ్మారెడ్డి వాగు పొంగి పొర్లినప్పుడు వందలాది కరెంట్ పోల్స్, వాటి విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు వరదనీటిలో కొట్టుకుపోయి తిమ్మారెడ్డి శివారులోని కొత్త హన్మాండ్ల గుడి వెనక ఒక కుంటలో నిలిచిపోయాయి. కుంటలో పశువులు నీళ్ల కోసం దిగితే కరెంట్ వైర్లు చుట్టుకుని పశువుల ప్రాణాలు పోతున్నాయి. మూడు రోజుల క్రితం ఈ కుంటలో రెండు గేదెలు కొమ్ములకు కరెంట్ తీగలు చుట్టుకుని ప్రాణాపాయ స్థితిలో మునిగిపోతుండగా స్థానికులు చూసి రక్షించారు. కుంటలోకి కొట్టుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్లను, విద్యుత్ తీగలను తీయకపోవడంతో నీళ్లలో నాని అవి నిరుపయోగంగా మారిపోయాయి. ఈ విషయమై రైతులు లైన్‌మెన్లకు తెలిపినా వారు పట్టించుకోలేదు. గ్రామాలలో పరిస్థితి ఇలా ఉంటే ఎల్లారెడ్డి పట్టణంలోని పలు శివారు ప్రాంతాలలో కరెంట్ తీగలు చేతికందేలా కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టణంలోని కుమార్ గల్లీలో జనావాసాల మధ్య ఉన్న మెయిన్ లైన్లు కూడా కిందకు వేలాడుతున్నాయని, పట్టణంలో కలిసి పోయిన గండి చెరువు శివారు భూముల్లో సైతం విద్యుత్ వైర్లు చేతికందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గాలి వాన కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కరెంట్ తీగలు కిందకు వాలుతున్నాయని ట్రాన్స్‌కో అధికారులు అంటున్నా.. ఇవి ఆరు నెలలకు పైగా కిందకు వేలాడుతున్నాయని ప్రజలు అంటున్నారు. తక్షణం సరిచేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని వారు కోరుతున్నారు.
తిమ్మారెడ్డి శివారులోని తమ పొలాల్లో కరెంట్ వైర్లు నేలకు వేలాడుతున్నాయని 2025, సెప్టెంబర్ 19న ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా వాటిని సరిచేయనేలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేయాల్సి వస్తోంది.
– హఫీజ్ పటేల్, రైతు, తిమ్మారెడ్డి


