ప్రజాపాలనలోప్రగతి పరుగులు | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనలోప్రగతి పరుగులు

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

ప్రజాపాలనలోప్రగతి పరుగులు

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..

మాట్లాడుతున్న వీహెచ్‌

కామారెడ్డి క్రైం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో సాగుతున్న ప్రజాపాలనతో తెలంగాణలో ప్రగతి పరుగులు తీస్తోందని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందుగా హైదరాబాద్‌ రోడ్‌లోని హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజా పరిపాలనను మరింత వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడం, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకమైన వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహించి 4,170 మందిని పరీక్షించారని హనుమంతరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు, క్రీడలలో ఉత్తమ ప్రదర్శన సాధించిన పది మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించామన్నారు. వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని హనుమంతరావు వివరించారు. ఆ వివరాలు..

● యాసంగిలో ఇప్పటివరకు 4,01,257 మెట్రిక్‌ టన్నుల వడ్లను కొనుగోలు చేసి రూ. 839.48 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశాం.

● ఈ ఏడాది మృతి చెందిన 627 రైతుల కుటుంబ సభ్యులకు రూ. 31.35 కోట్ల రైతు బీమా పరిహారాన్ని అందించాం.

● రైతు భరోసా కింద యాసంగిలో 3,09,281 మంది రైతులకు రూ.220.30 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చాం.

● యాసంగిలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 36,662 మెట్రిక్‌ టన్నుల మక్కలను సేకరించాం.

● 66 కొనుగోలు కేంద్రాల ద్వారా 14 వేల మెట్రిక్‌ టన్నుల పొద్దుతిరుగుడు, జొన్న, శనగలను కొనుగోలు చేశాం.

● మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 1,51,342 మంది లబ్ధిదారులకు 5,58,981 గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశాం. ఇందుకుగాను ప్రభుత్వం రూ.16.05 కోట్ల సబ్సిడీ అందించింది.

● 64 మంది దివ్యాంగులకు రూ.76.80 లక్షలతో రెట్రోఫిటెడ్‌ స్కూటీలను పంపిణీ చేశాం.

● వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న 5, 513 మందికి రూ. 3.73 కోట్ల ఉపకార వేతనాలు చెల్లించాం.

● 3,419 మంది విద్యార్థులకు రూ.1.60 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చాం.

● బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ద్వారా గత విద్యా సంవత్సరంలో 758 విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి, రూ.2.74 కోట్లను ఫీజుల రూపంలో చెల్లించాం.

● గృహ జ్యోతి పథకం కింద 1,73,803 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. దీనికి రూ.137.81 కోట్లు ఖర్చు చేశాం.

● 1,17, 667 వ్యవసాయ బోరుబావులకు రూ. 25.68 కోట్ల విలువైన ఉచిత విద్యుత్‌ అందించాం.

● జిల్లాలో 2,248 ఇందిరమ్మ ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు, 1,325 ఇళ్లు గోడల వరకు, 3,794 స్లాబ్‌ వరకు పూర్తయ్యాయి. 1,816 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించి లబ్ధిదారులకు రూ. 226.14 కోట్లు చెల్లించాం.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ రూ.50 వేలు అందించారు. అనంతరం రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవారికి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను అథితులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, ఏఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను దేశంలోనే

అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కృషి

ప్రభుత్వ సలహాదారు

వి.హనుమంతరావు

జిల్లాలో ఘనంగా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement