ఎల్లారెడ్డి: చేయూత పెన్షన్లకోసం అర్హులైనవారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని ఆశించినవారికి మళ్లీ నిరాశే మిగిలింది. దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు ఉసూరుమంటున్నారు.
నాలుగేళ్లుగా నిరీక్షణ..
గత ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత కొత్త పింఛన్ల ఊసు లేదు. జిల్లాలో వేలాది మంది అర్హులైనవారు నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం దరఖాస్తులకు సంబంధించిన సైట్‌ను కూడా మూసివేసింది. కాగా ప్రభుత్వం జూన్ 2వ తేదీన రెండు లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో అర్హులైనవారు ఆయా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. వీరి అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటూ రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతో శ్రమకోర్చి అవసరమైన సర్టిఫికెట్లు సమకూర్చుకున్నా చివరికి నిరాశే మిగిలింది. జూన్ 2 వచ్చినా చేయూత పెన్షన్లపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ విషయమై డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డిని వివరణ కోరగా కొత్త పింఛన్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. అర్హులైన వారి జాబితాను తయారు చేసి ఉంచుకోవాలని మాత్రమే పైఅధికారుల నుంచి సమాచారం అందిందన్నారు.
జూన్ 2న కొత్త సామాజిక పెన్షన్లు
ఇస్తారని ప్రచారం
ఆగమేఘాల మీద ధ్రువీకరణ పత్రాలు
సిద్ధం చేసుకున్న ప్రజలు
సర్కారు నుంచి ప్రకటన
రాకపోవడంతో నిరాశ


