భద్రతపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: విద్యార్థినులు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలు అనుచిత స్పర్శ ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై అవగాహన కల్పించారు. భద్రతను ఇచ్చేది గుడ్ టచ్ అని, భయం లేదా అసౌకర్యం కలిగించేది బ్యాడ్ టచ్ అని వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 లేదా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్ప్‌లైన్ 15100 కు కాల్ చేయవచ్చని సూచించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి, ఎంఈవో ఎల్లయ్య, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, సాధన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


