కదంతొక్కిన కార్మికులు
అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్‌వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్లు కదంతొక్కారు. జాతీయ కార్మిక సంఽఘాల పిలుపులో భాగంగా గురువారం టోకెన్ సమ్మెను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సింగరేణి గనుల వద్ద ధర్నా చేపట్టారు. అత్యవసర కార్మికులు మినహా సింగరేణి కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ఏరియాలో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్‌వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్ల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
– భూపాలపల్లి అర్బన్
కదంతొక్కిన కార్మికులు


