కాళేశ్వరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్
● పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసుల చర్యలు
● వంతెన నుంచి కాళేశ్వరానికి
పాత రోడ్డుకు హద్దులు
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ నది అంత్యపుష్కరాలకు గతంలో జరిగినట్లు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తుగా పోలీసుశాఖ దృష్టిసారించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశాల మేరకు శనివారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ తహసీల్ధార్ రామారావు, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కన్నెపల్లి సమీపంలోని అంతరాష్ట్ర వంతెన రోడ్డు నుంచి కాళేశ్వరం మధునపోచమ్మ చెట్టు సమీపం గుండా టవర్ వరకు పాత నక్ష గొలుసు రహదారిని రెవెన్యూశాఖ సర్వే చేసి ఫార్మేషన్ రోడ్డు వేసేందుకు హద్దులు వేశారు. కాగా, 33 ఫీట్ల వెడల్పుతో 25 మంది వరకు రైతులకు చెందిన భూముల గుండా రహదారి వెళ్లనుంది. ఈ రహదారితో ఏర్పాటుతో పుష్కరాలకు వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వాహనాలు లోపలికి కాకుండా అక్కడే పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 25–30 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పీఆర్ డీఈ సాయిలు, ఏఈ సతీష్, మహదేవ్‌పూర్ డిప్యూటీ తహసీల్దార్ యూసుఫ్, ఆర్‌ఐ రఘు, సర్వేయర్ రమేష్, కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, కన్నెపల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్, వీపీఓ శ్యామ్, దేవస్థానం మాజీ ధర్మకర్తలు అశోక్, సమ్మయ్య, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.


