బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి సొమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి మాసానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాల ను వెల్లడించారు. గడిచిన మాసంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.45 లక్షల టన్నులు ఉండగా 2.1 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 45శాతంలో నిలిచినట్లు చెప్పారు. రోజువారీ సగటు ఉత్పత్తి 6,497 టన్నులు సాధించి 3.25 లక్షల టన్నులు రవాణా చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి మాసంలో ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులు, కార్మికులు అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు. పనిగంటలను పెంచడం, గైర్హాజరు శాతాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు, ఉద్యోగుల అందరూ వర్కింగ్ పర్మిషన్ ఇతర భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు.
ఈనెల 10వరకు
గడువు పెంపు
భూపాలపల్లి రూరల్: ఉపకరణాల కోసం దివ్యాంగుల నుంచి స్వీకరిస్తున్న గడువు ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 155326 లో కానీ లేదా 96523 11804లో సంప్రదించాలని సూచించారు.
కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల టెన్త్ విద్యార్థిని రాష్ట్రస్థాయి సోషల్ టాలెంట్ టెస్టుకు ఎంపికై నట్లు హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన సోషల్ టాలెంట్ టెస్టులో విద్యార్థిని ఎండీ రింషా రెండో స్థానంలో నిలిచింది. రూ.1500 నగదు బహుమతి అందుకుంది. విద్యార్థినిని హెచ్‌ఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులను ఉత్తమ విలువలు కలిగిన వ్యక్తులుగా తయారు చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) విజయపాల్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టుకు జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎంఓ విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విలువలు కలిగిన మనుషులను తయారు చేయడంలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత గొప్పదన్నారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంఈఓ దేవానాయక్, ఫోరం ఉపాధ్యాయులు పోతర్ల సతీష్, రాంధన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని టీటూ క్వాటర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న సూపర్‌వైజర్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులు సోమవారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీటూ క్వాటర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న సూపర్‌వైజర్ బొచ్చు రవిని సివిల్ డీజీఎం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వెంటనే అతనిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జీఎం స్పందించాలని ఐఎన్‌టీయూసీ నాయకులు దుర్గం రవి మద్దతు తెలిపి మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి


