పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పీఓలు, ఏపీఓల బాధ్యతలు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పీఓ, ఏపీఓలుగా విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాక్ పోలింగ్, ఓటర్ల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓటింగ్ ముగిసిన తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.
ఆప్షన్ తీసుకోవాలి..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియోల నుంచి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. సోమవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి 14వ తేదీలోపు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు..
సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రాహుల్ శర్మ


