సెనేట్‌లోనూ హోరాహోరీ

US Senate and House races have become more competitive - Sakshi

100 స్థానాలకు గానూ 35 సీట్లకు ఎన్నికలు

పట్టు సాధించాలని భావిస్తున్న డెమొక్రాట్లు

వాషింగ్టన్‌: అమెరికా సెనేట్‌లో 35 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ సారి సెనేట్‌లో ఎలాగైనా పై చేయి సాధించాలన్న డెమొక్రాట్ల ఆశ నెరవేరుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికలతో పాటుగా అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఉభయ సభలకి ఎన్నికలు జరిగాయి. ఎగువ సభ అయిన సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లదే పై చేయిగా ఉంది. 100 స్థానాలకు గాను రిపబ్లికన్ల పార్టీకి 53 సీట్లు ఉంటే, డెమొక్రాట్ల బలం 45గా ఉంది. సభలో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. మొత్తం 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 21 స్థానాలను ఆయా పార్టీలు నిలబెట్టుకునే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మిగిలిన 14 సీట్లు కీలకంగా మారాయి. 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 23 స్థానాలు రిపబ్లికన్లవి కాగా, 12 స్థానాలు డెమొక్రాట్లవి. సెనేట్‌పై ఈ సారి ఎలాగైనా పట్టు సాధించాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. వారి ఆశ నెరవేరాలంటే రిపబ్లికన్ల స్థానాలు కనీసం మూడింటినైనా గెలవాల్సి ఉంది.

డెమొక్రాట్ల ఖాతాలో రెండు, రిపబ్లికన్లకి ఒకటి
ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం కొలొరాడో, అరిజోనా రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు చెందిన రెండు స్థానాల్లో డెమొక్రాట్లు పాగా వేస్తే, అలబామాలోని డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన స్థానాన్ని రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. కొలొరాడోలో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కోరి గార్డెనర్‌పై డెమొక్రాటిక్‌ పార్టీ మాజీ గవర్నర్‌ జాన్‌ హికెన్‌లూపర్‌ విజయం సాధించారు. ఇక అరిజోనాలో డెమొక్రాటిక్‌ అభ్యర్థి మాజీ ఆస్ట్రోనాట్‌ మార్క్‌ కెల్లీ విజయం సాధించారు. డెమొక్రాటిక్‌ ఖాతాలో ఉన్న అలబామాలో రిపబ్లికన్‌ అభ్యర్థి టామీ ట్యూబర్‌ విల్లె విజయకేతనం ఎగురవేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి మెయిల్‌ ఇన్‌ ఓట్లు ఎక్కువగా పోల్‌ కావడంతో తుది ఫలితలు రావడం మరింత ఆలస్యం కావొచ్చు.  



Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top