మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్‌పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్‌ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్‌పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.
ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్‌స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్‌పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.


