గురుపత్వంత్ సింగ్ ఎవరు? భారత్‌- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు? | Gurpatwant Singh Pannu Bitterness In The India And Canada Relation - Sakshi
Sakshi News home page

Gurpatwant Singh: భారత్‌- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?

Published Sat, Sep 23 2023 12:00 PM

Gurpatwant Singh Pannu Bitterness in the India and Canada Relation - Sakshi

భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించలేదు. ఈ కఠినమైన ప్రవర్తనకు స్పందనగా ట్రూడో తమ దేశంలోని సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) గ్రూప్‌తో సంబంధం ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించింది. అలాగే ఒక అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

కెనడావి నిరాధార ఆరోపణలు
కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది.  భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఖలిస్తాన్ మద్దతుదారులపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల  భారత వ్యతిరేక నిరసనల సంఖ్య పెరిగింది. 

ఆ భారత దౌత్యవేత్తలను హత్య చేయాలంటూ..
ఈ ఘటనల్లో నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) హస్తం ఉన్నట్లు తేలింది.ఈ సంఘంతో సంబంధం ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కెనడాలో నివసిస్తున్న హిందువులను దేశం విడిచి వెళ్లాలని కోరింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్‌సర్ జిల్లాలోని ఖాన్‌కోట్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్‌లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్‌ ఫర్ జస్టిస్‌కు న్యాయ ప్రతినిధి. అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్‌లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్‌లను ముద్రించాడు. భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

భారత్‌ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదంటూ..
కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్‌లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతుగా పన్నూ అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. భారతదేశం సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అతనిపై అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ కోరినప్పటికీ ఇంటర్‌పోల్ ఇంకా నోటీసు జారీ చేయలేదు.

కెనడా క్యాబినెట్‌లో నలుగురు సిక్కు మంత్రులు
కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో కెనడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడ వారు వ్యాపార రంగం మొదలుకొని రాజకీయ రంగం వరకూ ప్రభావవంతంగా ఉ‍న్నారు. ఈ నేపద్యంలో ఈ సిక్కు ఓటు బ్యాంకుకు ట్రూడో  కాపాడుకుంటూ వస్తున్నారు. ట్రూడో తన మొదటి టర్మ్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కులకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన క్యాబినెట్‌లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. అందుకే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారని విశ్లేషకుల వాదన.  అయితే  కెనడాలోని చాలా మంది సిక్కులు అతని భావజాలానికి మద్దతునివ్వడం లేదని సమాచారం. 

ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి
1980 నుండి భారతదేశం- కెనడా మధ్య అగాధం పెరిగింది. 1985లో కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద బృందం ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేయడంతో ఇది మొదలయ్యింది. ఈ పేలుడులో విమానంలోని మొత్తం 329 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడుపై జరిగిన దర్యాప్తులో ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా కొన్ని నెలల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ చిత్రం రక్తంతో తడిసిన చీరలో కనిపించడంతో  ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా కెనడాలో భారత వ్యతిరేక నిరసనలు తరచూ కనిపిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
ఇది కూడా చదవండి: ఖలిస్తాన్‌ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు?

Advertisement
 
Advertisement
 
Advertisement