వెల్లువలా ట్విటర్‌లో రాజీనామాలు.. ట్విటర్‌ను బొంద పెట్టిన ఎలన్‌ మస్క్‌!

Elon Musk Reacts ON RIP Twitter Trend After Massive Resignations - Sakshi

ఈ భూమ్మీ ఏం జరిగినా.. పరిణామం ఎలాంటిదైనా సరే జెట్‌ స్పీడ్‌తో వైరల్‌ అయ్యే ప్లాట్‌ఫారమ్‌ అది. అంతేకాదు.. ట్రెండింగ్‌ పేరిట విషయాలన్నింటిని మామూలు యూజర్లకు కూడా అర్థం అయ్యే రీతిలో చెప్పే మాధ్యమం. అలాంటి వేదిక ఇప్పుడు సర్వనాశనం అవుతోందని.. అందుకు ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్‌ మస్క్‌ కారణం అయ్యాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రిప్‌ ట్విటర్‌ ట్రెండ్‌ పుట్టుకొచ్చింది.
 

#RIPTwitter.. అదే ట్విటర్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌. అదీ అలా ఇలా కాదు.. వెల్లువలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. సంస్థను వీడుతున్న ట్విటర్‌ ఉద్యోగులే ఈ ట్రెండ్‌ను తీసుకొచ్చారు. ట్విటర్‌ కొత్త బాస్‌ తీరు.. పని షరతులు, కొత్త పరిస్థితులను  భరించలేక ఉద్యోగులు సంస్థకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రెండ్‌ తెరపైకి వచ్చింది. Twitter 2.0కు సంసిద్ధం కావాలని మస్క్‌ ఇచ్చిన పిలుపునకు స్పందన.. రాజీనామాల రూపంలో వస్తోంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. #LoveWhereYouWorked, #ElonIsDestroyingTwitter  అంటూ ట్యాగ్‌తో తమ నిరసన తెలియజేస్తున్నారు ఉద్యోగులు(మాజీలు).

ప్రముఖుల దగ్గరి నుంచి సామాన్య యూజర్ల దాకా డిగ్నిటీ ప్లాట్‌ఫామ్‌గా ట్విటర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. ఎప్పుడైతే ట్విటర్‌పిట్ట ఎలన్‌ మస్క్‌ చేత చిక్కిందో.. అప్పటి నుంచి దాని అంతం మొదలయ్యిందనే చర్చ జోరందుకుంది. ఆర్థిక నష్టం తప్పించుకునేందుకు సంస్కరణల పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల కోత, అదనపు ఆదాయం పెంచుకునే కొన్ని నిర్ణయాలు.. ఇలా ప్రతీదానిపైనా చర్చ(ప్రతికూల) జోరందుకుంది.

ఫేక్‌ అకౌంట్ల కట్టడి.. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడం కోసమే తాను కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని మస్క్‌ చేస్తున్న ప్రకటనలను.. యూజర్లు, ట్విటర్‌లో పని చేస్తున్న ఉద్యోగులు అంగీకరించని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో చాలామంది యూజర్లు ట్విటర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండడం కొసమెరుపు. మరోవైపు ఈపాటికే సగం మందిని తప్పించిన ఎలన్‌ మస్క్‌.. ఈ రాజీనామాలతో మరో పాతిక శాతం ఉద్యోగుల భారాన్ని వదిలించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్విటర్‌లో మిగిలిన 25 శాతం మంది ఉద్యోగ వీసాలపై ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త ఉపాధిని కనుగొనడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#RIPTwitter, #GoodbyeTwitter ట్రెండింగ్‌లో భాగంగా..  కొందరి భయాందోళనలు, మరికొందరి గందరగోళం, ఇంకొందరి హాస్యం.. ఇలా రకరకాల భావాలు ట్విట్టర్‌ను తాకుతున్నాయి. ఈ ట్రెండ్‌కు ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ సైతం స్పందించడం గమనార్హం. ‘అది మునిగిపోనివ్వండి…’ అంటూనే.. ట్విట్టర్ వినియోగంలో మరో ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించినట్లు  ట్వీట్‌ చేశాడు. ఈ విషయంలో తాను మొండిగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top