కనుల పండువగా శివపార్వతుల కల్యాణం
నేడు రాజరాజేశ్వరిదేవిగా దర్శనం, రథోత్సవం
కల్యాణ బ్రహ్మోత్సవాలను తిలకించి పరవశించిన భక్తులు
అన్నపూర్ణదేవిగా భ్రమరాంబ దర్శనం
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కొల్లిపర వంశీయులు
అభిషేకాల్లో పాల్గొనేందుకు
భక్తుల ఆసక్తి
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి కల్యాణ బ్రహోత్సవాలలో భాగంగా పెదకాకాని శివాలయంలో ఆదివారం రాత్రి వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా అర్చకులు గజవాహనంపై ఎదుర్కోల ఉత్సవం జరిపించారు. శివాలయం పునర్నిర్మాణ దాతలైన కొల్లిపర వంశీయులు భ్రమరాంబ మల్లేశ్వరస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ డిప్యూటి కమిషనర్ గోగినేని లీలాకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, పాలకవర్గసభ్యులు, అర్చకులు, భక్తులు సమక్షంలో సంప్రదాయబద్దంగా కల్యాణ క్రతువులో ముందుగా తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం తెల్లవారుజామున కనుల పండువగా గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి కల్యాణం జరిపించారు. ఆలయ ప్రాంగణమంతా ఓంనమఃశివాయ నామంతో మార్మోగింది. లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశ ద్రవ్యాలతో జరిగే అభిషేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆయా ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కల్యాణం తిలకించి భక్తిపారవశ్యంలో తరించారు. కల్యాణం అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలు, తలంబ్రాలు పంచిపెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులచే కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. మహాశివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబ అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులను అనుగ్రహించారు.
పెదకాకాని శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సాయంత్రం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
కనుల పండువగా శివపార్వతుల కల్యాణం


