నిరాశాజనకంగా రాష్ట్ర బడ్జెట్
పట్నంబజారు
(గుంటూరుఈస్ట్): పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించకపోవటం దారుణం. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాన్ని మోపటమే తప్ప బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికల వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి మరీ మోసం చేశారు. వాగ్దానాలు ఇవ్వటమే కాకుండా బాండ్ల రూపంలో సంతకాలు పెట్టి మరీ ప్రజలను వంచించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి పథకాలకు అంతంత మాత్ర కేటాయింపులు చేయటం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్, సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు వంటి కార్యక్రమాలకు పూర్తిగా పంగనామాలు పెట్టారు.
– అంబటి మురళీకృష్ణ,
వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త
గుంటూరు రూరల్: రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేస్తూ, ప్రజలకు పనికిరాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నిరుద్యోగ యువతను, మహిళాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీలు, బీసీల అభివృద్ధికి ఎటువంటి హామీ లేకుండా బడ్జెట్ రూపొందించారు. సంక్షేమాన్ని గాలికి వదిలి కేవలం చంద్రబాబు తన వర్గానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగకరంగా బడ్జెట్‌ను రూపొందించారు. నిరుద్యోగ భృతికి నామం పెట్టారు. రైతులను నట్టేట ముంచారు. మహిళలకు నెలకు రూ.1500 అని చెప్పి మహిళల నెత్తిన టోపి పెట్టారు. జీతాల పెంపు లేకుండా ఉద్యోగులను మోసం చేశారు. చంద్రబాబు అంటేనే మోసం అని మరోసారి రుజువు చేశారు.
– బలసాని కిరణ్‌కుమార్,
ప్రత్తిపాడు సమన్వయకర్త
పట్నంబజారు
(గుంటూరుఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలను నిలువునా వంచించారు. రైతు, మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యం లేకపోవడం బాధాకరం. నిరుద్యోగ భృతి, మహిళల రుణాలు, రైతుల రుణాలు మొదలగు అంశాలను అసలు పట్టించుకోకపోవటం దారుణం. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలుగా మారాయి. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. అంకెల గారడీతో.. అప్పుల గుదిబండతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు.
– ఈమని రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు,
వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం
నిరాశాజనకంగా రాష్ట్ర బడ్జెట్
నిరాశాజనకంగా రాష్ట్ర బడ్జెట్
నిరాశాజనకంగా రాష్ట్ర బడ్జెట్


