జలసంధిలో చట్టాల ఉల్లంఘన! | Sakshi Guest Column On America, Israel, Iran war and Strait of Hormuz | Sakshi
Sakshi News home page

జలసంధిలో చట్టాల ఉల్లంఘన!

May 1 2026 12:24 AM | Updated on May 1 2026 12:24 AM

Sakshi Guest Column On America, Israel, Iran war and Strait of Hormuz

విశ్లేషణ

ప్రపంచమంతా ఇరాన్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్‌ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్‌ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్‌ గుండా చమురు, గ్యాస్‌ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.

మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!
పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్‌ దిగ్బంధనం; రెండు, ఇరాన్‌ అణు కార్యక్రమం. హార్మూజ్‌ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్‌ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్‌ కాస్త మెత్తబడి హార్మూజ్‌ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్‌ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్‌ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. 

సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ ది సీ  (యు.ఎన్‌.సి. ఎల్‌.ఓ.ఎస్‌), 2. శాన్‌ రెమో మాన్యువల్‌. యు.ఎన్‌.సి.ఎల్‌.ఓ.ఎస్‌. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్‌ పాసేజ్, 2. ట్రాన్సిట్‌ పాసేజ్‌. తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్‌ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్‌.సి.ఎల్‌.ఓ.ఎస్‌. ఆర్టికల్‌ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్‌ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్‌ ప్యాసేజ్‌ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. 

భౌగోళిక రాజకీయ వ్యూహాలు
12 నాటికల్‌ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్‌ ప్యాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్‌.సి.ఎల్‌.ఓ.ఎస్‌. ఆర్టికల్‌ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్‌ ప్యాసేజ్‌ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్‌–ఒమన్‌ తీరాలను విభజించే హార్మూజ్‌ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్‌ మైళ్లు. ఒమన్, ఇరాన్‌ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్‌ వాటర్స్‌) చెరొక 12 నాటికల్‌ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్‌ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్‌ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్‌ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. 

అందుకే ఇరాన్‌ హార్మూజ్‌ను ఇన్నోసెంట్‌ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్‌ జలసంధి గుండా ఇరానియన్‌ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్‌.సి.ఎల్‌.ఓ.ఎస్‌  నిబంధనలను, యుఎన్‌ ఛార్టర్, హై సీస్‌ ఫ్రీడమ్‌ యాక్ట్‌ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్‌లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్‌ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్‌ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్‌ వంటి యూదుల ప్రైవేట్‌ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్‌ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్‌ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. 

వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్‌ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్‌–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్‌ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్‌ బూమ్‌తో అరబ్‌ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్‌లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్‌ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. 

ఇరాన్‌ మంత్రి రష్యా పర్యటన!
2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్‌ ప్రతిపాదించిన ఐమెక్‌ (ఇండియా మిడిల్‌ ఈస్ట్‌ యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్‌ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్‌’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్‌–యూఏఈలు డాలర్‌లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. 

యూఎస్‌ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్‌ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్‌ దేశాలు గత దశాబ్దకాలంగా  చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్‌ అనుసరిస్తున్న మల్టీ అలైన్‌మెంట్‌ విధానం అరబ్‌ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్‌–అమెరికాల మధ్య  శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్‌ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. 

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement