నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా  తగ్గించుకోండి!

Reduce Back Pain In This Way - Sakshi

నడుంనొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేరు. చాలా ఇబ్బంది పడుతుంటారు. తరచు పడకకే పరిమితం అయిపోవలసి వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా సింపుల్‌గా ఒక పెయిన్‌ కిల్లర్‌ను వేసేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మాత్ర నొప్పితోపాటు క్రమంగా మనల్నీ కిల్‌ చేస్తుంటుందన్న విషయాన్ని మరచిపోవద్దు. నడుంనొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు... సింపుల్‌గా తగ్గిపోతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం...

బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్‌తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్‌ గా ఉంటుంది.

సరైన శిక్షణతో వ్యాయామం..
నడుం నొప్పి నుంచి ఉపశమనం
నడుంనొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి.

కాల్షియం, విటమిన్‌ డి..
ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్‌ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్‌ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్‌ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్‌ డి ఉంటుంది.

చెప్పుల విషయంలో జాగ్రత్త
నడుంనొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుంనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. 

సరైన పొజిషన్‌..
ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్‌ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.

బరువు తగ్గించుకోవడం..
నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుమునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా, పై చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా విపరీతమైన బాధ నుండి కాస్తయినా ఉపశమనం పొందుతారు.

ఇవి చదవండి: బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top