ప్రకృతే నేస్తం.. ప్రకృతే పరమాత్మ..!

Nature is friendship, Nature is God - Sakshi

మంచి మాట

చిన్న..చిన్న మొక్కలే ఓ పెద్ద వనం అవుతుంది. మనం నాటిన మొక్కే మనకు నీడను ఇస్తుంది, ప్రాణ వాయువు ఇస్తుంది. మానవ జీవితంలో మనం చేయాల్సిన ముఖ్య విధానం ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి అనేది భగవంతుడే ఏర్పరచిన ఓ అద్భుత సంపద. దాన్ని వినాశనానికి గురి చేయకుండా ప్రకృతి పట్ల అర్థవంతంగా నడచుకో అనే సందేశాన్ని ప్రతి వారు గ్రహించాలి. అప్పుడే ప్రకృతికి పరమార్థం ఇచ్చినట్లు అవుతుంది.

ఈ ప్రకృతి ఏర్పడటమే ఓ విచిత్రం. చెట్లు, చేమలు, వివిధ జంతువులు, విహంగాలు, నదులు, పర్వతాలు... ఇవన్నీ ఎవరి సృష్టి అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికర్త ఆజ్ఞ వలన ఈ సృష్టి ఏర్పడింది. సృష్టిని నిర్మించింది ఆ పరమాత్మనే అనే మాట వినిపిస్తుంది. పరమాత్మ ప్రకృతికి ప్రాణం పోస్తే, పరమాత్మ ద్వారా సృష్టించబడిన మానవుడు నేడు ప్రకృతి వినాశనానికి కారకుడు అవుతున్నాడు.

స్వేచ్చగా చెట్లు నరకడం, అనువుగాని చోట్ల నిర్మాణాలు చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించే కలుషిత కర్మాగారాలు స్థాపించడం వంటి వాటి వలన ప్రకృతి పాడవుతున్నది. మానవుడు తన స్వలాభాలను చూసుకుంటున్నాడే గాని పదిమందికి ఉపయోగపడే ప్రకృతికి ప్రాణం పోయాలి అనే విషయం మరచి నట్లు ఉన్నాడు. విచ్చలవిడిగా వ్యర్ధ పదార్థాలను ధరణిపై వేసి ప్రకృతి నిరోధానికి పరోక్షంగా కారకుడు అవుతున్నాడు. ప్రకృతి అనేది ఓ దైవం అనే మాటను విస్మరిస్తున్నాడు.

పచ్చని ప్రకృతిని ఓ క్షణం పరిశీలిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ప్రకృతిలోని పక్షుల కిల.. కిల రావాలు, పారే సెలయేర్లు, శబ్దం చేసే పాల పొంగులాంటి జలపాతాలు, అందంగా పేర్చినట్లు ఉండే పర్వత శ్రేణులు చూస్తుంటేనే ఓ మధురానుభూతికి లోనవుతాం. రోజు కొంత సేపు ప్రకృతిలో విహరిస్తే మనం పొందే అనుభూతే వేరు. అయితే నేడు చాలామంది వాకింగ్‌ వంకతో ప్రకృతిని ఆస్వాదిస్తామంటారే కానీ వాళ్ళు ఆస్వాదించేది అంతా వాళ్ళ చెవులలో పెట్టుకుని వినే పాటలే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఇయర్‌ ఫోన్లు పెట్టుకునే వారే కనిపిస్తారు. వాళ్ళు ఏమి ఆస్వాదిస్తున్నారో, ఏమి వింటున్నారో అర్థం కాదు. మనం ప్రయాణిస్తున్నప్పుడు కనపడే చెట్టు, చేమ చూడటం వలన ఓ ఆనందం కలుగుతుంది.

ఈ విశ్వంలో జరిగే కార్యాలు అన్నీ ప్రకృతి వల్లనే జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారం, గర్వం కారణం మూలంగా మనిషి మాత్రం తానే అన్నిటికీ కర్తనని, మూలం తానేననీ, తన ప్రయోజకత్వం వల్లనే అన్ని కార్యాలు జరుగుతున్నాయని భావిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ‘నేను చేస్తున్నాను’ అనుకోకపోతే ఏ పనినీ చేయలేడు. చిక్కు అంతా ఎక్కడ వస్తుందీ... అంటే సమస్తం నేను చేస్తున్నాను. నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అని అహంకార పూరితుడిగా మారినప్పుడే. అప్పుడే వ్యక్తి పతనపు అంచులకు ప్రయాణం సాగిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇటువంటి అహంకారం మానవుణ్ణి కిందకు లాగుతుంది.

సత్వ రజస్తమోగుణాలతో కూడిన  ఈ ప్రకృతిని అధిగమించడం కష్టం. ఈ సువిశాల విశ్వమంతా చాలా వరకు అన్ని కార్యాలు ప్రకృతి పర్యవేక్షణలోనే జరిగిపోతూ ఉంటాయి. భూమిలో విత్తనం వేసి నీళ్ళు పోయాడమే మనం చేయగలిగేది. కాని ఆ విత్తనం నుండి మొలక రావడం, మొక్క పెరగడం, అది కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుని నుండి ఆహారం స్వీకరించడం మొదలగు అన్ని క్రియలలో వ్యక్తి ఏమి చేయగలుగుతున్నాడో అని బేరీజు వేసుకుంటే విశ్వంలో జరిగే ప్రతి క్రియలో ప్రకృతి పాత్ర మిక్కుటం. తల్లి గర్భంలో ఫలదీకరణ చెందిన జీవి ఎన్ని మార్పులకు గురవుతుందో సరిగ్గా ఆచి తూచగలిగే జ్ఞానం, విజ్ఞానం మనకు ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇది కేవలం ప్రకృతి ద్వారానే సాధ్యం. ఇంతటి మహత్తర కార్యం ప్రకృతి వలననే జరుగుతుండగా మనిషి ‘నేనే కర్తను’ అని అహంకరించడం ఏ మాత్రం సబబు?

ఎప్పుడైతే నేనే అని అనుకుంటున్నాడో అప్పుడే నాది... నాదే అనే మమకారం మొదలవుతుంది. ఈ ‘అహం’, ‘మమ’ అనే రెండు భావాలే ఇరువైపులా నుండి వ్యక్తిని పతనం వైపుకు నెడతాయి.
అహంతో నేనే కర్తను అని భావించుకుంటూ తమ పతనానికి తానే గోతిని తవ్వుకుంటూ ఉంటారు కనుక ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా ప్రకృతి మయమనే, ప్రకృతే సర్వం, సర్వం ప్రకృతే అని భావించవలసి వస్తుంది.

అందమైన ప్రకృతిని వీక్షించడం అంటే ఆ భగవంతుని చూడటమే. ప్రకృతికి మనం ఎంత దగ్గర అవుతామో అంత భగవంతునికి దగ్గర అయినట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క ను నాటి దాని ఆవశ్యకతను తెలియజేస్తే మొక్కలు పట్ల అభిరుచి పెరుగుతుంది. విద్యార్థులలో కూడా ప్రకృతి అంటే జిజ్ఞాస కలుగుతుంది.

– కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర ఉపన్యాసకులు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top