మద్యం దోపిడీకి పచ్చజెండా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: విచ్చలవిడి మద్యం దోపిడీకి మళ్ళీ తెరలేచింది. జిల్లాలో కొత్తగా పొలిటికల్ ఎమ్మార్పీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులతో మధ్యంతర దోపిడీకి ఒక వైపు తెరలేస్తే మరో రూ. 10 పొలిటికల్ ఎమ్మార్పీ అంటూ క్వార్టర్ సీసాపై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో నో రూల్స్. నో ఎమ్మార్పీ.. కూటమి చోటా నేతలు నిర్ణయించిందే ధర. సమీక్షా సమావేశాల్లో జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు అంటూ చేసే హడావుడి కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది.
జిల్లాలో 155 వైన్‌షాపులు, 20 బార్లు కలిపి నెలకు సగటున రూ.120 కోట్ల నుంచి రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి వైన్‌షాపుకు అనుబంధంగా పదుల సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి. గ్రామగ్రామాన మద్యాన్ని ఏరులై పారించడమే ఏజెండాగా బెల్టుషాపులకు తెరదీశారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రత్యేక పొలిటికల్ ఎమ్మార్పీ, డ్రై డే ఇతర ప్రత్యేక రోజుల్లో ఇష్టానురీతిలో విక్రయించుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాల్లో వైన్‌షాపులు కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, కొన్ని చోట్ల ప్రత్యక్ష భాగస్వామ్యంతో మరికొన్ని చోట్ల పరోక్ష భాగస్వామ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో షాపుల ఏర్పాటు సమయంలోనే షాపులకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల మేరకు విక్రయాలు, షాపు స్థాయిని బట్టి ధర నిర్ణయించి అధికార పార్టీ నేతలు వ్యాపారుల నుంచి వసూలు చేశారు. గతేడాది కొత్త లైసెన్స్‌లు అమలులోకి వచ్చినప్పటి నుంచే రూ.10 ఎమ్మార్పీ అదనంగా కొనసాగిస్తున్నారు. తాజాగా రూ.10 అదనంగా అమ్ముకోవచ్చని ఇచ్చిన జీవోను అడ్డం పెట్టుకుని రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదంతా ఎకై ్సజ్ అధికారులకు తెలిసే కొనసాగిస్తున్నారు.
ఊరూరా బెల్టుషాపులు
ప్రతి వైన్‌షాపుకు అనుబంధంగా సగటున 40 నుంచి 60 బెల్టుషాపులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బెల్టుషాపులు అధికార పార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. క్వార్టర్‌కు సగటున రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. సమయపాలనతో సంబంధం లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. రెండు రోజులు క్రితం ముఖ్యమంత్రి ఐఎఎస్ అధికారులతో నిర్వహించిన ప్రగతి సమావేశంలోనూ దీనిపై చర్చ సాగింది. ఎమ్మార్పీ అధిక ధరలకు విక్రయాలు, బెల్టుషాపుల కట్టడి విషయంలో రాష్ట్రంలో జిల్లా 8వ స్ధానంలో ఉందని బెల్టుషాపులు లేకుండా, ఎమ్మార్పీకు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సమీక్షలో సూచించారు. ప్రతి వైన్‌షాపుకు ఓ ధర నిర్ణయించి ఎకై ్సజ్ శాఖ నెలవారీ ప్రత్యేక వసూళ్లు కొనసాగిస్తుంది. దీనికిగాను అడపాదడపా డ్రై డేలు, జాతరలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అదనంగా రూ.30 పెంచి అమ్ముకున్నా పట్టించుకోని పరిస్థితి.
క్వార్టర్‌పై రూ.20 అదనం
రూ.10 ప్రభుత్వ ధరకు మరో రూ.10 పొలిటికల్ ధర
జిల్లాలో నెలకు సగటున రూ.120 కోట్ల మద్యం విక్రయాలు
బెల్టు షాపుల్లో స్పెషల్ రేట్లు


