పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి

Feb 14 2026 7:57 AM | Updated on Feb 14 2026 7:57 AM

పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి

పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి

పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి డీఈఓ భిన్న ప్రకటనలతో గందరగోళం పది, ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష అవినీతికి చెక్‌ పెట్టాలి బలివే ఉత్సవాలు విజయవంతం చేయాలి

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్‌ మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, మేనిపెస్టోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పీబీవిఎన్‌ఎల్‌ నారాయణ మాట్లాడుతూ తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 11వ పీఆర్సీ గడువు పూర్తై 30 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్‌ పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే పీఆర్సీ గడువుదాటి మూడు సంవత్సరాలు కావస్తుందని తక్షణమే కమిటీ నియమించి ఐఆర్‌ ప్రకటింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాను సీపీఐ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించి మద్ధతు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెండో శనివారం పాఠశాలలకు సెలవుపై జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్‌; జిల్లా అధ్యక్షుడు వీ. రామ్మోహన రావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తుఫాను ప్రభావం వల్ల ఇచ్చిన సెలవులో భాగంగా రెండో శనివారం ప్రతి పాఠశాల పని చేయాల్సి ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు శనివారం సెలవుగా డీఈఓ ప్రకటించారన్నారు. అది కూడా 220 పనిదినాలకు సరిపోయే పాఠశాలలు సెలవు దినంగా ప్రకటించుకోవచ్చని తెలిపారన్నారు. తిరిగి సాయంత్రం ఏడు గంటల సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు శనివారం పనిచేయాలని ప్రకటిస్తూ, వాట్సప్‌లో మెసేజ్‌ పెట్టడం దారుణమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించడాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.

ఏలూరు (మెట్రో): పది, ఇంటర్‌ పరీక్షలలో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి పరీక్షలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతప్తి స్థాయి, కోర్టు భవనాల కోసం స్థలం, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్థల సమస్యలు, తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అవినీతి నిరోధశాఖ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతి సమాజమే లక్ష్యంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని, జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా.. ఎక్కడైనా లంచం కోరితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 లేదా 9440446157, 9440446159 నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ కోరారు.

బలివే (ముసునూరు): భక్తులు బలివే రామలింగేశ్వర స్వామిని సులువుగా దర్శించుకుని తిరిగి క్షేమంగా వెళ్ళేలా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బలివే ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్న పొరపాటుకు తావు లేకుండా మహా శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement