సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారి ఆర్ హేమ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించిన ఆమె మామిడి తోటల సస్యరక్షణపై రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి తోటల్లో పూతమీద తేనెమంచు పురుగు ఆశించినట్లయితే, నివారణకు అజారక్టిన్ 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి, బుప్రోపెజన్ 25 ఈసీ 1.5 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా థయామిథాక్సాన్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలు 40 నుంచి 50 వరకు తోటల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేపనూనె 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పోంగామియా సోప్ 7.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, ఎసిఫేట్ 75 ఎస్‌పీ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 5 ఈసీ 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చన్నారు.
బూడిద తెగులు నివారణ ఇలా..
నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పక్షికన్ను తెగులు సోకితే..
నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ 1 గ్రాము, మాంకోజబ్ 2.5 గ్రాములు కలిపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మసిమంగు నివారణకు
ఎమామెక్టిన్ బెంజీయేటర్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని 3 నుంచి 4 లీటర్ల నీటిలో కలిపి ఉడికంచిన తరువాత మిగులు నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావకం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజల్లో పిచికారీ చేయాలి. 4–5 రోజుల తరవాత నీటిని పిచికారీ చేస్తే చాలా వరకు మసి రంగు పోతుందని ఉద్యాన అధికారి హేమ తెలిపారు.
పాడి–పంట
సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు


