అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారమ్‌లో ఒక యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం రాయ్‌ఘడ్ జిల్లా బీఎల్‌ఓడీ మండలం ఓయ్‌పంగు గ్రామానికి చెందిన పతిక రష్మిక (19) నాలుగు రోజుల క్రితం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారం వద్ద జీవనోపాధి కోసం వచ్చి పనిలో చేరింది. అయితే ఆ యువతి షెడ్‌లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. రష్మిక అదే కోళ్లఫారమ్‌లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా పరిచయం ఉండి ఒరిస్సాలోనే సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్‌కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ తన భార్యతో కలిసి కోళ్ల ఫారమ్‌లో పనిచేస్తుండగా రష్మిక కూడా నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ముగ్గురూ ఒకే గదిలో నివసిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రశాంత్, అతని భార్య పని నిమిత్తం కోళ్లఫారమ్‌కు వెళ్లగా రష్మిక షెడ్‌లో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


