వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారుగొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె భోజనం చేస్తుండగా, ఇంటి తలుపులు కొట్టిన శబ్ధం విని తలుపు తీసింది. ముఖానికి గుడ్డకట్టుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, వృద్ధురాలి మెడలోని 2 కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీనిపై వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి ఎస్సై టి.చెన్నారావు కేసు నమోదు చేశారు. సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై విచారణ నిర్వహించి నిందితుడు కామవరపుకోట మండలం పాతూరు గ్రామానికి చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు. కామవరపుకోట చింతలపూడి వెళ్లే రోడ్‌లో గ్రామ శివారు ఆర్‌ఆర్‌జీకే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.40లక్షలు విలువైన 14.600 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్‌సైకిల్, వృద్ధురాలిపై దాడికి వినియోగించిన ఇనుప రాడ్డు, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కేసును చేధించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై టి.చెన్నారావు, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, పీసీలు ఎస్‌కే షాన్, ఎన్.రమేష్, ఎ.సుధీర్‌లను ఏఎస్పీ అభినందించారు.


