గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
ద్వారకాతిరుమల: రెండు బైక్‌లపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను ద్వారకాతిరుమల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన బండారి శివ, దుదాని లక్ష్మణ్‌సింగ్, మూరగుంట్ల ఆనంద్‌లు బైక్‌లపై వస్తూ ఘటనా స్థలంలో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్సై సుధీర్‌కు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ జేవీ సుబ్బారావు, మధ్యవర్తుల సమక్షంలో సదరు యువకులను విచారించి, తనిఖీలు చేశారు. వారి వద్ద 12.885 కేజీల గంజాయి కలిగిన 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.6.45 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. సీలేరు దగ్గర పసుపులంక నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగించిన బైక్‌లను సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి యాజమాన్యం అదనంగా రూ.1,500 వసూలు చేస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ బ్లాక్ భవనం పై అంతస్తులో హాస్టల్ నిర్మించారు. నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,500 వరకు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రూ.1,000 మెయింటినెన్స్, మరో రూ.500 బస్సు కోసం చెల్లించాలని చెబుతున్నారు. ఇప్పటికే హాస్టల్, మెస్‌కు ప్రతినెలా రూ.5,500 చెల్లిస్తుండగా అదనంగా రూ.1,500 కట్టాల్సి రావటంతో తమ కుటుంబాలపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో 150 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా వారిలో 130 మంది వరకూ హాస్టల్‌లో వసతి పొందుతున్నారు. వీరిలో ఫ్రీ సీటు సాధించిన వైద్య విద్యార్థులు సుమారు 78 మందికి పైగా ఉంటారు. వీరంతా సామాన్య రైతు, పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు చెందిన వారు. ఫ్రీ సీటు సాధించిన సామాన్య, మధ్యతరగతి వర్గాల వైద్య విద్యార్థులపై చులకన భావనతో కాలేజీ యాజమాన్యం మాట్లాడుతుందని విద్యార్థులు అంటున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దైన్యస్థితిలో విద్యార్థులు ఉన్నారు. అదనంగా సొమ్ములు చెల్లింపులు, హాస్టల్‌లో వసతులపై నిలదీస్తే.. మీ పేర్లు చెప్పండి.. మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు.
ఏలూరు(మెట్రో): ఉగ్రవాద హింస, తీవ్రవాదం, సరిహద్దు కాల్పులు, తదితర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో అర్హత కలిగిన పిల్లలకు 25 సంవత్సరాల వరకు వారి విద్యకు సంబంధించిన మౌలిక అవసరాల కోసం ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. ఈ పథక ప్రయోజనాలు పొందేందుకు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఇతర సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారిని 08812– 249883 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
తాడేపల్లిగూడెం: భారత ప్రభుత్వ ఆధీనంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిట్‌లో గత రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జన్ సేవా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, వృత్తి నిపుణులుగా, సేవా దృక్పథం కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ఈ కర్మయోగి మిషన్ ముఖ్య ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. కొత్త విషయాలను ఉద్యోగులకు విశదీకరించారు. రెండు రోజుల్లో 122 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


