ముసాయిదాలోని అంశాలు అంగీకరించం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్– 2026 ముసాయిదాలోని అంశాలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆయా అంశాలను ఏమాత్రం అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది. స్థానిక పవర్‌పేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త ముసాయిదా పెన్షన్ నిబంధనలపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై సమష్టిగా చర్చించి, ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ –1980ను దెబ్బతీసే ఏ మార్పులనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహించబోమని, ప్రభుత్వం వెంటనే ఈ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.


