కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి
నూజివీడు: నూజివీడుకు మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి గత ప్రభుత్వం కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెంటనే కేబినేట్ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ వికాస్ గుప్తాను మంగళవారం ప్రతాప్ అప్పారావు కలిసి నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా వికాస్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఏడెకరాల స్థలాన్ని కేబినేట్ మీటింగ్‌లో అప్రూవ్ చేసి కమిషనర్‌కు పంపాలని కోరారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయ నిర్వహణకు రెండేళ్ల క్రితమే ఎంప్లాయిస్ కాలనీలో 16 తరగతి గదులతో తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు అప్పగించామని, సికింద్రాబాద్‌లోని డిప్యూటీ కమిషనర్ సైతం నూజివీడు విచ్చేసి భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఏడాదిన్నరగా ప్రారంభించకుండా ఉండటం వల్ల నూజివీడు ప్రాంతంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలకు అన్యాయం జరుగుతోందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను తీసుకువస్తే ఇంత వరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేలా, ఏడెకరాల స్థలాన్ని కేబినేట్‌లో అప్రూవ్ చేసేలా కృషి చేయాలని ప్రతాప్ అప్పారావు కోరారు.
మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు


