పస్తులుంటున్నాం.. జీతాలివ్వండి !
కై కలూరు: కుటుంబాలతో సహా పస్తులుంటున్నాం.. ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి.. అంటూ కై కలూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు 20 మంది తాలూకా సెంటర్‌లో సోమవారం భిక్షాటన చేశారు. దుకాణాల వద్దకు వెళ్ళి జోలి పట్టి డబ్బులు అడుక్కున్నారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ జీతాలు అందించపోయినా పనులు మాత్రం మానలేదన్నారు. ఇప్పటికే అప్పులు చేసి వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. తక్షణం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయతీ ఈవో వి.ఫణిరాజకుమారిని వివరణ కోరగా ఇటీవల ఎంపీడీవో సెలవులో ఉండడంతో ఇన్‌చార్జి ఎంపీడీవోకు బాధ్యతలు ఇచ్చారన్నారు. తిరిగి ఎంపీడీవో విధుల్లో చేరారన్నారు. ఈ క్రమంలో జీతాలు చెల్లించడంలో ఆలస్యం అయ్యిందన్నారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.


