హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు.. | - | Sakshi
Sakshi News home page

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

హరహరా

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..

మహిమాన్వితుడు భోగేశ్వరుడు

కై కలూరు: దక్షిణ కాశీగా పేరుగడించిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి దివ్య కల్యాణ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 13 నుంచి 17 వరకు జరగనున్నాయి. స్వామివారి దివ్య కల్యాణం 14వ తేదీ రాత్రి 1.25 గంటలకు నిర్వహిస్తారు. ఇప్పటికే దేవస్థానంకు రంగులు, చలువ పందిర్లు, క్యూలైన్లు, కోనేరు శుభ్రం వంటి పనులను శరవేగంగా చేస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రికి రెండో శనివారం, ఆదివారం రెండు రోజున సెలువు దినాలు రావడంతో దాదాపు లక్షపైనే భక్తులు స్వామి దర్శనానికి విచ్చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా ప్రాకార మండప నిర్మాణ తవ్వకం పనుల్లో సాలిగ్రామ శివలింగాకారం బయల్పడటంతో భక్తుల సంఖ్య పెరిగింది.

జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన భోగేశ్వరస్వామి శివరాత్రి తీర్థానికి విచ్చేసే భక్తుల కోసం పంచాయతీరాజ్‌ నుంచి రూ.10 లక్షలు, మండల పరిషత్‌ నుంచి రూ.5 లక్షలతో శాశ్వత మరుగుదొడ్లును నిర్మిస్తున్నారు. నూతన ప్రాకార మండప పనులను పునఃప్రారంభించారు. దాతల సాయంతో కోనేరును శుభ్ర పరిచే పనులు పూర్తి చేసి కొత్త నీటిని నింపారు. దేవాలయ ప్రాంగణంలో రహదారులను ఏర్పాటు చేశారు. రాజగోపుర నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆలయ అధికారులు చెప్పారు.

11వ శతాబ్దం నుంచి పూజలు..

వేంగిరాజు రాజరాజచోళుడు 11వ శతాబ్దంలో శివాలయాన్ని నిర్మించారు. భోగేశ్వరలంకలో రైతు పొలంలో నాగలి కర్ర తగిలి రక్తం పారుతూ స్వయంభూలింగం బయటపడింది. కర్రతగిలి విరిగిన భాగాన్ని అతికించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ భాగం నుంచి రక్తపు నీరు చమరిస్తున్నట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కోడికూత, రోకటి పోటు వినలేనంటూ ఏకాంతంగా ఉన్న ఈ చోటనే ఆలయ నిర్మించాలని స్వామి కోరాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. పూర్వం వర్షకాలంలో ఒక రోజున జోరున వర్షం కురుస్తుంటే స్వామి నిత్యార్చనకు ఆలస్యం జరిగిందట. దీంతో స్వామి వారు స్వయంగా ధ్వజస్తంభం ఎక్కి అర్చకుల రాకను గమనించి ధ్వజ స్తంభంపై నుంచి దూకడంతో కింద స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతోంది.

నన్నయ్యబట్టు తొలి తెలుగు కావ్యం ఇక్కడే

రాజరాజ నరేంద్రుడు నాలుగు పద్యాల కావ్యంలో శోభించేలా కవి నన్నయ్యభట్టుచే తొలి తెలుగు కావ్యం ఇక్కడే రాయించారని చరిత్రలో చెప్పారు. పూర్వం రాజరాజనరేంద్రుడు, కవి నన్నయ తణుకులో నిర్వహించిన యజ్ఞం పూర్తి చేసుకుని ఆశ్వాలపై కలిదిండికి వచ్చారు. దారిలో ఓ నలుగురు అశ్వాల కంటే ముందు పరిగెత్తుతూ ఇక్కడ కోనేరులో దిగి మాయమయ్యారు. సరస్వతి దేవీ ప్రతక్ష్యమై మీకు ఎదురు పడింది ‘భోగేంద్రులు నాగేంద్రులు’ అని చెప్పి ఇక్కడ కోనేరు ద్వారా పాతాళానికి వెళ్తారని తెలిపింది. ఒడ్డున నిలిచి పాతాళ భోగేశ్వరా హరహర అని పిలిస్తే బుడబుడ మంటూ బుడగలు వస్తాయని అమ్మ చెప్పిందని పురాణం. ఇప్పటికీ బుడబుడ శబ్దాలు వినిపించడం ఒక వింత.

13 నుంచి పాతాళ భోగేశ్వరస్వామి శివరాత్రి ఉత్సవాలు

11వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన శివాలయం

తాజాగా తవ్వకాల్లో బయల్పడిన మరో సాలిగ్రామ శివలింగాకారం

సుమారు లక్ష పైబడి భక్తులు విచ్చేస్తారని అంచనా

అతి పురాతనమైన భోగేశ్వరస్వామి స్వయంభూలింగం. తాజాగా సాలిగ్రామ లింగం ఇక్కడ నిర్మాణ పనుల్లో బయల్పడింది. భక్తుల దర్శనార్థం శివాలయ ఆవరణలో ప్రతిష్ట చేయాలని భావిస్తున్నాం. శివరాత్రికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. శివరాత్రి జాగారం రాత్రి ఆకట్టుకునే సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది లక్షపైనే భక్తులు విచ్చేస్తారని భావిస్తున్నాం.

– శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో, పాతాళభోగేశ్వరస్వామి దేవస్థానం

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు.. 1
1/3

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు.. 2
2/3

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు.. 3
3/3

హరహరా అంటే బుడబుడా నీటి బుడగలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement