అక్రమ అరెస్టులకు భయపడేది లేదు
ద్వారకాతిరుమల: కూటమి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత అన్నారు. మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపై ఇటీవల జరిగిన దాడి, ఆయన అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో కలసి వనిత సోమవారం గుంటూరులోని అంబటి ఇంటికి వెళ్లారు. తొలుత ద్వారకాతిరుమల మండల నాయకులు భీమడోలు మండలం గుండుగొలను హైవేపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్లలో వారంతా ర్యాలీగా గుంటూరులోని రాంబాబు ఇంటికి తరలివెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి, ఆయన్ను పరామర్శించారు. వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇంకెంతో కాలం అది చెల్లదన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలసిందని అసత్య ఆరోపణలు చేసి, చివరకు భంగపడ్డ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు దాకారపు బంగారమ్మ, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, షేక్ మస్తాన్ బాషా, మల్లిపూడి నాగమణి, దాసరి రాంబాబు తదితరులున్నారు.


