జిల్లా ఫారెస్టు అధికారిణి విజయ బదిలీ
కై కలూరు: ఏలూరు జిల్లా ఫారెస్టు అధికారిణి బత్తిన విజయ ఆకస్మిక బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నుంచి సోమవారం కార్యాలయానికి ఉత్తర్వులు చేరాయి. డీఎఫ్‌ఓ విజయను రాష్ట్ర అటవీ అధికారికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆమె స్థానంలో ఇన్‌చార్జిగా జిల్లా టెరిటోరియల్ డీఎఫ్‌ఓ పొతంశెట్టి సందీప్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. డీఎఫ్‌వో విజయ 2021లో కై కలూరు ప్రాంత రేంజర్‌గా పనిచేశారు. తర్వాత మాచర్లకు బదిలీపై వెళ్లారు. తిరిగి 2024 సెప్టెంబరులో ఏలూరు జిల్లా వన్యప్రాణి ఫారెస్టు అధికారిణిగా పదోన్నతిపై విధులు చేపట్టారు. ఇటీవల సుప్రీంకోర్టు సాధికారిత కమిటీ(సీఈసీ) బృందానికి నేతృత్వం వహించారు. సీఈసీ అదేశాలతో కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువులను ధ్వంసం చేయాలని రాజమండ్రి సర్కిల్ పీసీసీఎఫ్ బీఎన్‌ఎన్.మూర్తితో కలసి కొల్లేరులో అక్రమ చెరువుల ధ్వంసానికి ప్రయత్నించారు. చటాకాయి, నత్తగుళ్లపాడు వంటి గ్రామాల్లో చెరువుల ధ్వంసానికి వెళితే ప్రజలు నిరసన తెలిపారు. కొల్లేరు నాయకులు అటవీ అధికారుల చర్యలను వ్యతిరేకించారు. తర్వాత ప్రజాప్రతినిధులకు అటవీ అధికారులపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపధ్యంలో విజయ బదిలీ అటవీశాఖలో చర్చనీయాంశంగా మారింది.


