వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి
మందులు కొట్టినా తెగుళ్లు తగ్గలేదు
ఎకరం పంట దెబ్బతింది
● ఉధృతంగా బోడు, సీతాఫలం, మానుమచ్చ తెగుళ్లు
● ఆలస్యంగా వేసిన పంటల్లో అధికంగా తెగుళ్ల ప్రభావం.. దిగుబడిపై రైతుల్లో ఆందోళన
బుట్టాయగూడెం: పొగాకు పంటలపై దాడి చేస్తున్న తెగుళ్లను చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బోడు, మానుమచ్చ, సీతాఫలం, ఆకు ముడత వెర్రితలలు వంటి పిచ్చిమెక్కలు ఎక్కువగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఎదిగి ఆకు రెలుపు దశకు వచ్చాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా పొగాకు పంటల్లో ఎక్కువగా బోడు అధికంగా కనిపిస్తూ తోట ఎదుగుదల లేకుండా ఎండిపోయింది.
26,883 హెక్టార్లలో వర్జీనియ పొగాకు సాగు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 11,855 మంది రైతులు 26,883 హెక్టార్లలో ఈ ఏడాది సీజన్‌లో పొగాకు పంట వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పొగాకు తోటలు ఎదుగుదల దశలో ఉన్నాయి. అలాగే పలు గ్రామాల్లో క్యూరింగ్ పనులు చేస్తున్నారు. ఈ దశలో పంటలపై తెగుళ్లు దాడి చేయడంతో పలు చోట్ల మొక్కలు ఎదుగుదల లేక దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్న బోడు
గిరిజన ప్రాంతంలో వేసిన వర్జీనీయా పొగాకు పంటలో ఈ ఏడాది ఎక్కువగా బోడు ఉంది. దీని వల్ల పొగాకు మొక్కలో ఉన్న సారాన్ని బోడి పీల్చేస్తుందని దీని వల్ల మొక్క ఎదుగుదల లేకపోవడం, పంట దిగుబడి బాగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆకు రంగు మారిపోవడం బుట్టాయగూడెం, కొమ్ముగూడెం, అచ్చియ్యపాలెం, వీరన్నపాలెం, నూతిరామన్నపాలెం, ముప్పినవారిగూడెం తదితర గ్రామాల పరిధిలో వేసిన పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు గుర్తించినట్లు బోర్డు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అనుకూలించని వాతావరణం
పొగాకు పంటలకు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేదని రైతులు చెబుతున్నారు. మొక్కలు నాటిన రోజు నుంచి తీవ్రమైన చలి, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల పొగాకు తోటల్లో ఎదుగుదల లేదని రైతులు వాపోతున్నారు. మొక్క సాధరణంగా 22 నుంచి 28 ఆకులు వస్తాయని, వాతావరణం అనుకూలించక పోవడం వల్ల 17 నుంచి 23 ఆకులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పొగాకు పంటల్లో తెగుళ్లు దాడి ఉందని, బుట్టాయగూడెం మండలంలో పొగాకు తోటల్లో ఎక్కువగా బోడు ఉన్నట్లు గుర్తించినట్లు జంగారెడ్డిగూడెం వేలం–1 సూపరిటెండెంట్ బి. శ్రీహరి తెలిపారు.
ఈ ఏడాది పొగాకు పంటపై తెగుళ్లు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. బోడుతో పాటు మానుకుల్లు, ముజాకో మచ్చ తెగ్లుళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నివారణకు మందులు కొడుతున్నా తోటల్లో తెగుళ్లు తగ్గడం లేదు. బోడు పంటలను మరింత దెబ్బతీస్తోంది.
– సయ్యద్ బాజీ, వర్జీనియా పొగాకు రైతు, అచ్చియ్యపాలెం
నేను బుట్టాయగూడెం వీరన్నపాలెం సమీపంలో 5 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. ఆ పంటలో బోడు ఎక్కువగా ఉంది. దీని వల్ల ఎకరం పంట దెబ్బతిని పాడైపోయింది. పంట ఎదుగుదల నిలిచి పోయింది. ఆకు రంగు మారిపోయింది. ఈ ఏడాది పొగాకు పంటలో బోడు ఎక్కుగా వచ్చింది.
– ఆచంట విష్ణుమూర్తి,
పొగాకు రైతు, సూరపవారిగూడెం
వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి
వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి
వర్జీనియా పంటపై తెగుళ్ల దాడి


