జై వనరూపిణీ.. విజయకారిణి
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
కైకలూరు: సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు పొంగళ్లు, వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లడుతూ ఆదివారం ఒక్క రోజున వివిధ రూపాల్లో అమ్మవారికి రూ.77,091 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర(తీర్థం) జరుగుతుందన్నారు. ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
పెదవేగి : ఆగి ఉన్న లారీని మోటారు సైకిల్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన నున్న రాంబాబు అతని చిన్న కుమార్తె కుందన శ్రీతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు తంగెళ్ళమూడిలోని సోదరుడి ఇంటి వెళ్తుండగా పెదవేగి మండలం చక్రాయగూడెం గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నున్న రాంబాబు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమార్తె కుందనశ్రీకి తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. రాంబాబు భార్య నున్న లక్ష్మీ అనూష ఫిర్యాదు మేరకు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు అర్బన్: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు సూచించారు. తణుకులోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ జేఈఈ పరీక్షల్లో తమ విద్యా సంస్థలో ప్రతి ఐదుగురిలో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పారు. మెడికల్‌లో తమ సంస్థలో ప్రతి ముగ్గురిలో ఒకరికి సీటు వస్తుందని వివరించారు. సంస్థ వైస్ చైర్‌పర్సన్ రష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్.మురళీకృష్ణారెడ్డి, సంతోషి, విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, తణుకు కాలేజ్ ప్రిన్సపాల్ కె.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
తణుకు అర్బన్: కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన దువ్వ గ్రామ పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కుటుంబ సభ్యు లు బొమ్మిడిలో ఫంక్షన్ చూసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దువ్వ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కారు పిల్లకాలువలోకి జారిపోయింది. కారులో జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విప్పర్తి అశోక్‌కుమార్‌తో పాటు కుటుంబసభ్యులు వీరవల్లి సురేంద్ర, నరేంద్ర, పల్లెకొండ ప్రవీణ్, వీరవల్లి చంద్రమౌళి, 8 సంవత్సరాల బాలిక విప్పర్తి అస్మిత ఉన్నారు. పిల్ల కాలువ , నీరు తక్కువగా ఉండడంతో వీరంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని 108 వాహనంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటనపై ఏ ఫిర్యాదు రాలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
జై వనరూపిణీ.. విజయకారిణి
జై వనరూపిణీ.. విజయకారిణి


