బలివేలో మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
బలివే (ముసునూరు): చారిత్రక ప్రసిద్ధ చెందిన బలివేలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఆలయ, ఉత్సవ ప్రాంగణాలు, స్నాన ఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులను డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ అప్రమత్తం చేశారు. తాజాగా ఆలయ ప్రాంగణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం శుభ ఘడియల్లో ఆలయ అర్చకులు తోలేటి అరుణ భాస్కర్, చావలి అమర్ బాబు మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించి, పందిరి రాట (గుంజ) వేసి, పందిర్లు, క్యూ లైన్లు ఏర్పాటు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పామర్తి సీతారామయ్య, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


