విత్తనాల కల్తీని సహించం
మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు(మెట్రో): జిల్లాలో నాణ్యత లేని, కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం మంత్రి మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే ఎరువుల సరఫరా సమస్యలు లేకుండా చూడాలన్నారు. 22ఏ కేసుల పరిష్కారం, ఆయిల్‌పామ్, కోకో, కొబ్బరి పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పేదల గృహ నిర్మాణాలు, పాపికొండల వద్ద పర్యాటక అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, మట్టి అక్రమ రవాణా తదితర అంశాలపై మాట్లాడారు. మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.


