వక్ఫ్ భూముల ఆక్రమణకు యత్నం
నూజివీడు: వందలాది ఎకరాల వక్ఫ్‌భూములను కబళించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం దారుణమని వైఎస్సార్‌సీపీ ముస్లీం మైనారిటీ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ యూనస్‌పాషా(గబ్బర్) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ జిలానీ, నాయకులు షేక్ మస్తాన్‌వలీ, జలాల్‌ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ ఖదీర్, అలీ బాషాలు శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లింలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కారన్నారు. ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలోని 71.57 ఎకరాలను, మల్లాయపాలెం ప్రాంతంలోని 232 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రెండు చోట్ల ఉన్న వక్ఫ్ భూములు అత్యంత విలువైనవని, వాటిని సరిగా వినియోగిస్తే ముస్లిం సమాజానికి భారీ ఆదాయ వనరులుగా మారతాయన్నారు. వక్ఫ్‌భూములను టీడీపీ అనుకూల వర్గాలకు కేటాయిచేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముస్లింలు భావిస్తున్నారన్నారు. వక్ఫ్ భూములను తీసుకోవడాన్ని నిరసిస్తూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ నెల 9న కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తారన్నారు.


