దివ్యాంగుల క్రికెట్ విజేతగా ఆంధ్రప్రదేశ్
దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్‌డీఓ అజీజ్ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్‌డీఓ అజీజ్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు, గుప్తా ఫౌండేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్ ఫౌండేషన్ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్ అండ్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి, క్రికెట్ అకాడమీ సెక్రటరీ మదన్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2026–27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం పరీక్ష ఈ నెల 7న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో, 11వ తరగతికి ప్రవేశ పరీక్ష 3 పరీక్ష కేంద్రాలలో జరుగుతాయన్నారు. 9వ తరగతికి 639 మంది, 11వ తరగతికి 677 మంది పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 11 గంటల తరవాత ఎవరిని అనుతించరని, పరీక్ష పూర్తి అయ్యేవరకు ఎవరినీ బయటకు వెళ్ళడానికి అనుమతించరని స్పష్టం చేశారు. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే బబుల్ చేయాలని, పరీక్ష కేంద్రం లోకి మొబైల్ ఫోన్లు, చేతి గడియారం, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. 9490728768, 9704812546 హెల్ఫ్‌లైన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉద్యోగ భద్రత కోల్పోతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తూ గత గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో జిల్లా నుంచి యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశామన్నారు. టెట్ సిలబస్, అర్హత మార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరారని చెప్పారు.
దివ్యాంగుల క్రికెట్ విజేతగా ఆంధ్రప్రదేశ్


