కాలువ గట్టు మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి అక్రమార్కులు మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వారం రోజులుగా కన్నాపురం పులిరామన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎత్తిపోతల కాలువ గట్టు నుంచి మట్టి రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రేయింబవళ్లు మట్టి తోలకాలు సాగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో కాలువకు గండ్లు పడే ప్రమాదం ఉందని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాలలోని పరిసర గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా కాలువ గట్టు ఎత్తిపోతల మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన గ్రావెల్ మట్టికి బదులు నాణ్యతలేని మట్టిని వినియోగించడం వలన భవిష్యత్తులో నిర్మాణాలు సుదీర్ఘ కాలం ఉండవని ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులు వెళుతున్న సమయంలో రైతులకు చెందిన జీ రాయితీ భూములను పేర్కొంటూ తీరా వాళ్లు వెళ్లిపోయాక మళ్ళీ కాలువ గట్టు తవ్వకాలు చేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
నూజివీడు : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోను క్లియర్ కాకుండానే క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్‌లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్ అయిపోయిందని చెప్పి బ్రాంచ్‌కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్ రిలీజ్‌కు ప్రయత్నించారు. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు.
భీమడోలు: పొలసానిపల్లి రహదారి వద్ద ఏర్పాటు చేసిన కూటమి నాయకుల ఫ్లెక్సీలను గ్రామానికి చెందిన వ్యక్తులు ధ్వంసం చేయించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం గ్రామ సర్పంచ్ షేక్ రహీమాబేగం తెలిపారు. సీసీటీవీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


