‘మార్చి’ మసాలా?

Vardhelli Murali Article On AP Politics In March - Sakshi

జనతంత్రం

తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్‌ చరిత్రకర్థం. నిజమే, అవి మాత్రమే చరిత్ర కాదు. కానీ, చరిత్ర గతిలో చోటుచేసుకునే పరిణామాల పర్యవసానంగా కొన్ని తారీఖులకు, కొన్ని మాసాలకు, కొన్ని సంవత్సరాలకు ఏదో ఒక ప్రాధాన్యతనో, ప్రత్యేకతనో ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించినంత వరకు మార్చి నెలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల నుంచీ ఈ ప్రత్యేకత కొనసాగు తున్నది. మనకు సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రతలు ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. పొలిటికల్‌ టెంపరేచర్‌ మాత్రం మార్చిలోనే పీక్స్‌కు చేరడం రివాజుగా మారింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఏటా మార్చిలోనే ప్రారంభం కావడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఏడాది మొత్తంలో ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే సీజన్‌ కూడా ఇదే కనుక, ఎత్తులూ-పైఎత్తులు, సవాళ్లు- ప్రతి సవాళ్లూ మార్చిలోనే మొదలయ్యేవి. గడిచిన నాలుగు సాధారణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మే నెలల్లోనే జరిగాయి. వ్యూహాలు-ప్రతివ్యూహాలు, టికెట్లు-అలకలూ, పొత్తులూ-జిత్తులూ, ప్రచార శంఖారావం ఇలా కీలక విషయాలన్నీ మార్చిలోనే చోటు చేసుకునేవి.

తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు మార్చి నెల మరింత కీలకమైనది. ఆ పార్టీ ‘హ్యాపీ బర్త్‌డే’ కూడా ఈనెలలోనే. వచ్చే 29వ తారీఖునాడు ఆ పార్టీకి 39 ఏళ్లు నిండి నలభయ్యో ఏట అడుగుపెడుతుంది. ఏ పార్టీ అయినా సరే, ఏదో ఒక నెలలో పుడుతుంది. ఏడాది తిరిగేసరికి బర్త్‌డే వస్తుంది. ఇందులో పెద్ద విశేషమేముంటుంది?. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పెద్ద విశేషమే ఉందట! ఆ పార్టీ నలభయ్యో ఏట అడుగుపెట్టేసరికి ‘క్లినికల్లీ డెత్‌’ స్థితికి చేరుకుంటుందని పార్టీ పాతతరం నేత ఒకరు వ్యాఖ్యానించారు. నలభయ్యేళ్లు నిండేం తవరకు వెంటిలేటర్‌ మీద నెట్టుకొస్తారో మధ్యలోనే పీకేస్తారో వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయనొక్కరి అభిప్రాయమే కాదు. ఆ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న చాలామంది నాయకులు, కార్యకర్తలు ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో వున్న ఐదేళ్లపాటు కొన్ని వర్గాలు లేదా కొందరు వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలకోసమే ప్రభుత్వం పనిచేసిందన్న అభిప్రాయం క్షేత్రస్థాయి కార్యకర్తల్లోకి వెళ్లిందని వీరు అభిప్రాయపడుతు న్నారు. ‘మేము అధికారంలో వున్న రోజులను, వైఎస్‌ జగన్‌ పరిపాలనతో జనం పోల్చి చూస్తున్నారండీ... చెప్పుకోవడానికి మాకేమున్నది గర్వకారణం. జనంలోకి వెళ్లడానికి ముఖం చెల్లడం లేదు’–ఇది సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుని కామెంట్‌. రోజూ పొద్దున్నే లేవగానే ఏ దిశవైపు నడవాలో, ఏ దిక్కున కూర్చోవాలో... ఇంకా ఇలాంటివే సలహాలు ఎవరెవరో కొత్త వాళ్లు వచ్చి ఇస్తున్నారు. మా నాయకుడు పాటిస్తున్నారు. కానీ, పార్టీ వాళ్లం మేం చెప్పే మాటలు మాత్రం వినడం లేదని దక్షిణ కోస్తా నాయకుడొకరు వాపోయారు. సొంత నియోజక వర్గం కుప్పంలోనే మీరు అవసరం లేదు, కొత్త నాయకుడిని తీసుకు రమ్మని కార్యకర్తలు ఆయన ముఖం మీదే చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలదీ అదే పరిస్థితి. ఏదో... వాళ్ల ఆశ తప్ప నాయకత్వం మారినా కూడా పార్టీ బతికే పరిస్థితి లేదు. చేయి దాటిపోయిందని గుంటూరు డెల్టా నాయకుడొకరు చెప్పు కొచ్చారు.

ఎందరో ఓడిపోగా గెలిచిన ఒక కృష్ణా జిల్లా నాయకుడైతే ‘పార్టీని గెలిపించే సత్తా ఇప్పుడు మా లీడర్‌కు లేదని’ బహి రంగంగానే వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపే తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు గోడదూకే అవకాశం ఉందట. గెలిచింది ఇరవైమూడు మంది. అందులో నలుగురు ఇప్పటికే జంప్‌. ఈ తొమ్మిదిమంది తోడ యితే పదముగ్గురు. మిగిలేది ఇక పది మంది. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుని హోదా గల్లంతు ఖాయం. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులను గానీ, కార్యకర్తలను గానీ ఎవర్ని కది లించినా చెబుతున్న లెక్కలివే. ఒక నాయకుడైతే ఈ లెక్కలతో కూడా విభేదిస్తున్నాడు. నికరంగా మిగిలేది ఏడుగురేనండీ. రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిన అచ్చెన్న అందులో ఒకరు. మరొకరు చంద్రబాబు. ఇంకొకరు బాలయ్య బాబు. మిగిలిన నలుగుర్నీ ఊహించగలరేమో ప్రయత్నించం డంటూ ఆ నాయకుడు ఒక పజిల్‌ను విసిరాడు. పార్టీ పుట్టిన దగ్గర్నుంచీ కీలకంగా వ్యవ హరిస్తున్న సీనియర్‌ మోస్ట్‌ బీసీ నేతను కొందరు నేతలు ఇటీవల కలిశారట. అధినాయకుని వ్యవహారం బాగాలేదు. ఆయన మాట్లాడుతున్న తీరు పట్ల జనంలో వ్యతిరేకత వస్తున్నది. ఎంత నిస్పృహతో వున్నా ఇంత దిగజారి మాట్లాడాలా? ఏం పీకు తారంటాడు... ఏం మాటలివి? వాళ్ళబ్బాయి అలాగే మాట్లాడు తున్నాడు. సీనియర్‌ నాయకులు మీరైనా కలుగజేసుకుని ఆయనకు చెప్పండని సూచించారట. అంతా ఆయన, వాళ్లబ్బాయి, ఆ రెండు జిల్లాల నాయకులు చూసుకుంటారు. మనకెందుకు లెమ్మని సదరు సీనియర్‌మోస్ట్‌ నిట్టూర్పు విడిచారట.

పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై కూడా అంతర్గతంగా పార్టీ వర్గాల్లో తీవ్ర అసమ్మతి వ్యక్తమైంది. ఎనభై శాతం పంచాయతీలను మా మద్దతుదార్లు గెలుచుకున్నారని వైసీపీ ప్రకటించింది. వాళ్ల ఫొటోలను కూడా వెబ్‌సైట్లో పెట్టారు. పార్టీ రహిత ఎన్నికల్లో ఏవిధంగా ఈ లెక్కలు చెబుతారని మా నాయకుడు ప్రశ్నిస్తే సరిపోయేది. తగుదునమ్మా అంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి మా వాళ్లు ముప్పయ్‌ ఎనిమిదీ పాయింట్‌ మూడు మూడు శాతం గెలిచా రని ప్రకటించారు. వాళ్ళబ్బాయి ఇంకో అడుగు ముందుకువేసి నలభై రెండూ పాయింట్‌ నాలుగూనాలుగూ శాతం గెలిచామని ప్రకటించాడు. ఎవరీ శాతాలు? ఎక్కడున్నారు? వాళ్ల పేర్లేవి? ఫొటోలేవి? జనం నవ్వుకున్నారు. పరువు పోయిందని వాపోయారు. ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఏం మాట్లాడతాడో చూడాలని వుందని ఒక నాయకుడు వ్యాఖ్యా నించారు. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్ని కలు. దబాయిస్తే కుదరదు. మా అంచనాల ప్రకారం తెలుగు దేశం పార్టీకి చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణమైన ఓటమి ఎదురుకాబోతున్నది. మా లెక్క ప్రకారం తొంభై శాతానికి పైగా మునిసిపాలిటీలను వైసీపీ గెలుచుకోబోతున్నది. మాకు చావు దెబ్బ తగలబోతున్నదని ఆ నాయకుడు జోస్యం చెప్పారు. ఈనెల 29న బర్త్‌డే నాటికి తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌ పైకెక్కడం ఖాయమన్న ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో వేగంగా వ్యాపిస్తున్నది.

ఒక రాజకీయ పార్టీకి నలభయ్యేళ్లు రావడం పెద్ద వయ సొచ్చినట్టేమీ కాదు. తమిళనాడులో యాభైయేళ్లుగా ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలో వుంటున్న రెండు ద్రవిడ పార్టీలు ఇప్పటికీ పూర్తి జవసత్వాలతో తలపడుతున్నాయి. మరి తెలుగుదేశం పార్టీకే అప్పుడే నూరేళ్లు నిండిన పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? ముఖ్యంగా రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి - అధికారంలో వుండగా తెరతీసిన అవినీతి-అస్తవ్యస్త పాలన, ప్రతిపక్ష నేతగా వైఫల్యం. రెండవదీ, ముఖ్యమైనదీ– గడిచిన ఇరవై రెండు మాసాల్లో జనరంజకమైన వైఎస్‌ జగన్‌ పాలన.

మానవీయ కోణంలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక విలక్షణమైనది. ‘రాష్ట్రంలోని యావన్మంది ప్రజలకు నిన్నటికంటే నేడు బాగుండాలి. నేటి కంటే రేపు మరింత బాగుంటుందన్న విశ్వాసం కలగాలి’. ఇదే అభివృద్ధికి గీటురాయి కావాలని ముఖ్యమంత్రి సూత్రీకరించి నట్టు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ సహచరులతో పాటు, అధికార యంత్రాంగానికి కూడా ఆయన ఈ మంత్రో పదేశం చేశారని చెబుతారు. ఈ లక్ష్యసాధనకు అనుగుణమైన వ్యూహాన్ని ఎన్నికలకు ముందే ఆయన మేనిఫెస్టో రూపంలో పొందుపరుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేనిఫెస్టోకు మరికొన్ని అంశాలను జోడించి తన మానవీయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొందరు సంక్షేమం అనే ముద్ర వేశారు. సంక్షేమం బాగానే ఉన్నది, మరి అభివృద్ధి ఏదీ? అనేది వీరి ప్రశ్న. వీరికి ఒక ఎదురుప్రశ్నను వేయవలసిన అవసరం ఉన్నది. అసలు అభి వృద్ధి అంటే ఏమిటి? అది ఎవరికోసం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్య క్రమం సులభంగా అర్థమవుతుంది.

ఒకటో తేదీనాడు సూర్యోదయంతోపాటు ఇంటి తలుపు తట్టి చేతిలో వాలే పెన్షన్‌ డబ్బుల వంటి సమాజ సంక్షేమ చర్యలతోపాటు, సమ్మిళిత అభివృద్ధికి దారులు తీసే ఒక ఆరు అంశాలను ఫోకస్‌ ఏరియాలుగా ప్రభుత్వం చేపట్టినట్టు కని పిస్తున్నది. ఈ ఆరు రంగాలు- 1. ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగల స్థాయి మెరికల్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దే విద్యా రంగం సంస్కరణలు. కాణీ ఖర్చులేకుండా పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను అభ్యసించే హక్కును ప్రసాదించడం ఈ సంస్కరణల్లో కీలకం. ప్రతి బిడ్డకూ ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువుకునే అవకాశం లభించింది. తెలుగు మాధ్యమం నుంచి ఇంగ్లిష్‌లోకి మారే క్రమాన్ని సులభసాధ్యం చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠ శాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ‘అమ్మఒడి’ నుంచే ప్రారంభమయ్యే ప్రభుత్వ ప్రోత్సాహం అంగన్‌వాడీల మీదుగా కేజీ నుంచి పీజీ వరకు కొనసాగేంతవరకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల రూపంలో వెంట నిలుస్తుంది. రానున్న కాలంలో ఈ విద్యారంగ సంస్కరణలు పెను విప్లవం సృష్టించబోతున్నాయని చెప్పడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ప్రవేశాల సంఖ్యే ఒక పెద్ద సాక్ష్యం. 2. ఆరోగ్యవంతమూ తద్వారా ఆత్మ విశ్వాసంతో కూడిన సమాజానికి బాటలు వేసే ఆరోగ్యరంగ సంస్కరణలు - ఆరోగ్యశ్రీ మరింత విస్తరించింది. ప్రతి పల్లెలో ప్రతి వాడలో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. నాడు - నేడు కార్యక్రమం ప్రజారోగ్య రంగాన్ని ప్రదీప్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్‌ ఆస్పత్రులకంటే మెరుగైన స్థితికి చేరుకుంటున్నాయి. ప్రతి గడపా ఒక డాక్టర్‌ డైరీలో నమోదై ఉంటుంది. 3. జనాభాలో అధిక శాతానికి ఇప్పటికీ జీవనాధారంగా మిగిలిన వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రంగం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణాలను గుర్తించి వాటిని పరిహరించే చర్యలను చేపట్టారు. ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఏటా రూ.13.500లు అందుతున్నాయి. నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా శాశ్వత పరిష్కారం కింద 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్‌పుట్స్‌ ఇంటి ముంగిటకు వచ్చాయి. రైతుకు నష్టం జరగకుండా పెద్దఎత్తున పంటల కొనుగోళ్లను ప్రభుత్వం చేపట్టింది. 4. మహిళా సాధి కారత కోసం విప్లవాత్మక చర్యలు– లక్షలాదిమంది మహిళలకు వారి పేర్ల మీద ఇళ్ల పట్టాలు అందాయి. ఆ యింట్లో ఆమె మాటకు విలువ పెరగబోతున్నది. 45 లక్షలమంది మహిళలకు వారి పిల్లలను బడికి పంపించినందుకు ప్రోత్సాహకంగా ‘అమ్మఒడి’ నగదు లభిస్తున్నది. బిడ్డ చదువులో ఆమె మాట కీలకం కాబోతున్నది. ప్రభుత్వం నామినేట్‌ చేసే పదవుల్లో సగం, ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో సగం మహిళలకే కేటాయించడం జరిగింది. సగం ఆకాశం తానేనన్న ఆత్మవిశ్వాసం కలుగు తున్నది. దిశ చట్టానికి కేంద్రం ఆమోదం లభిస్తే ఆమెకు ఒక ఆయుధం దొరికినట్టే. 5. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ప్రజలకు జీవనాధారం కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) పరిశ్రమలను పునరుజ్జీవింప జేసి ఆర్థిక రంగంలో కీలకపాత్రను పోషించేలా ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. 6. పారదర్శకమైన, అవినీతి రహితమైన ప్రభుత్వ పరిపాలన ప్రజల ఇంటి ముంగిళ్లలోకి వచ్చింది. ప్రజా సంక్షే మానికి ప్రభుత్వం ఖర్చుచేసే వ్యయంలో రూపాయికి 16 పైసలు మాత్రమే లక్ష్యాన్ని చేరుతున్నదని పాతికేళ్ల కింద దేశంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిని అధిగ మించడానికి ఏం చేయాలనే అంశంపై అనేక మేధోమథనాలు జరిగాయి. ఇప్పుడు ప్రతిపైసా లబ్ధిదారుని చేతికి అందుతున్న యథార్థం కళ్లముందట ఆవిష్కృ తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ప్రజా ప్రభుత్వానికి అసలుసిసలు చిరు నామాలుగా నిలబడ్డాయి. ప్రజలు ప్రభుత్వాన్ని వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితిని తలకిందులు చేసి ప్రభుత్వం ప్రజలను వెతు క్కుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇదీ జనజీవితాల్లో వచ్చిన గుణాత్మక మార్పు.

ఈ రాజకీయ పరిణామాల పూర్వరంగంలో ప్రజావిశ్వాసం అనే రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీని ఈ నెలాఖరునాటికి క్లినికల్‌ డెత్‌గా నిర్ధారిస్తే అందుకు బాధ్యత ఎవరిది? తెలుగుదేశం శ్రేణుల్లో రానున్న రోజుల్లో విస్తృతంగా జరగబోయే చర్చ ఇదే. ఇంకో విశేషమేమిటంటే అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది కూడా మార్చిలోనే. మొన్న పన్నెండో తేదీనాడే 11వ ఏట ప్రవేశించింది. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన బర్త్‌డే ఈరోజే. ఆ పార్టీకి నేటితో ఏడేళ్లు నిండుతాయి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top