వనస్థలిపురం ఏసీపీ సస్పెన్షన్‌పై అధికారుల విచారణ

Special Authorities Investigation On Vanasthalipuram ACP Suspension Case - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సీపీ కార్యాలయం అధికారులు భూవివాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణా అధికారులు బాధితులతో కలిసి భూమిని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 73 నుంచి 101మధ్య సర్వే నెంబర్లలోని 412 ఎకరాల భూమిని పరిశీలించారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భూమి వేల కోట్ల విలువ కలిగి ఉంది.  సానా సతీష్ బినామీల ఆధీనంలో ఉన్న 412 ఎకరాల్లో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల తప్పుడు కేసులు, బెదిరింపులతో భూమి స్వాధీనం  చేసుకొని అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. కమల ప్రియా ఆటో జనరల్ ఏజన్సీ పేరుతో ఈ వివాదాస్పద భూమిపై భారీ లోన్‌ కూడా తీసుకున్నారు. కోల్‌కతా ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా రుణం తీసుకున్న సానా సతీష్ బినామీ కంపెనీ హైపొతికేషన్‌ పేరుతో ఆ భూముల్లో బోర్డ్ ఏర్పాటు చేశారు. 

గతంలో టెనెంట్స్‌కు, యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుంటుంబ సభ్యులు. దీంతో సాన సతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో ఆనందరావు వారసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే భూమిపై ప్రస్తుతం హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో  గతంలో తహశీల్దార్‌, వీఆర్‌ఓలపై సస్పెన్షన్ వేటు పడింది.  విజయా రెడ్డి అనే  తహశీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం స్పెషల్ టీం అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా విచారిస్తే సానా సతీష్‌తో పాటు మరికొందరు పెద్దల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

ఎస్‌ఆర్‌ నగర్‌ ఇన్స్‌పెక్టర్‌పై వేటు
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌.మురళీకృష్ణపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను  ఏసీపీ జయరాం వద్దకు పంపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంలో కారకుడయ్యాడని నిర్ధారించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

కాగా సానా సతీష్‌ భూ వివాదంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ జయరాం కార్యాలయంలోనే ఓ మహిళ పట్ల  అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మురళీకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ నూతన ఇన్స్‌పెక్టర్‌గా నర్సింహారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.  

ఇబ్రహీంపట్నం భూములపై సీబీఐ విచారణ జరిపించాలి 
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్యాక్రాంతముతున్న ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారం భూ వివాదంతో పాటు ఓ ప్రైవేటు సంస్థ 500 ఎకరాల్లో ఫెన్సింగ్‌ వేసి కుంటలు, చెరువులను కబ్జా చేసిందని, ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు ప్రైవేటు పరం అయ్యాయన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్‌ఏ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top