హంద్రీనీవా కాలువలో దుప్పి మృతి
పెద్దపంజాణి: మండలంలోని కమ్మనాయునిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువ నీటిలో దుప్పి కొట్టుకు రావడాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని హంద్రీనీవా, ఫారెస్టు అధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు ఈతగాడు పవన్‌కుమార్‌తో దుప్పిని నీటిలో నుండి బయటకు తీయించారు. అప్పటికే అది మృతి చెంది ఉండడంతో పశువైద్యాధికారి వినీత కుమారి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కార్యక్రమంలో హంద్రీనీవా డీఈ సెల్వరాజ్, ఏఈ మహేష్, ముత్తుకూరు బీట్ ఎఫ్‌బీఓ శోభనాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు.
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
బంగారుపాళెం: యువకుని హత్య కేసులో శనివారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ మండలంలోని సదకుప్పం గ్రామంలో మామిడి తోపులో చెట్లకు మందు కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు, జానకిరామ్, రాజసింహ, సుమంత్‌రెడ్డి అనే వ్యక్తులు దళితవాడకు చెందిన మనోజ్‌తో ఘర్షణపడి తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీంతో మనోజ్ మృతి చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసుకు సంబంధించి జానకీరామ్, రాజసింహ, ఓ బాలుడిని బంగారుపాళెం–అరగొండ రహదారి ఎస్‌ఎల్‌వీ కల్యాణ మండపం వద్ద పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసులో బాలుడైన నిందితుడిని జువనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాల మేరకు తిరుపతిలోని జువనైల్ హోమ్‌కు తరలించామన్నారు. మరో నిందితుడు సుమంత్‌రెడ్డి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
హంద్రీనీవా కాలువలో దుప్పి మృతి


