భూములు ఇవ్వలేం.. న్యాయం చేయండి
వి.కోట: ఎటువంటి నోటీసులు జారి చేయకుండా భూములను సేకరించడానికి ప్రయత్నాలు చేయడం ఎంత వరకు న్యాయమని చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు.. మండలంలోని ముదరందొడ్డి పంచాయతీ చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులస్తులకు ముదరందొడ్డి 74 రెవెన్యూ లెక్క దాఖల భూమిలో వర్షాధార పంటలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ భూముల్లో దాదాపు 20 ఎకరాల్లో సోలార్ సిస్టం ప్లాంట్ ప్రాజెక్ట్ అమర్చడానికి సిద్ధం చేస్తోంది. అనుభవంలో ఉన్న ఎస్సీ కులస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ చిన్నాగనపల్లి గ్రామ ఎస్సీ రైతులు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుకు శుక్రవారం వినతి పత్రం అందించారు. దీనిపై స్పందిన ఆయన సోలార్ సిస్టం ఏర్పాటుపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి న్యాయం చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు.
ప్రాంగణ ఎంపికలో
21మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడీ రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో హైదరాబాద్‌కి చెందిన ఎంఆర్‌ఎఫ్ కంపెనీ చేపట్టిన ప్రాంగణ ఎంపికల్లో 21 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. శుక్రవారం కళాశాలలో జరిగిన ఈ ఎంపికల్లో కంపెనీ డిప్యూటీ మేనేజర్ రఘురాం పాల్గొని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి ఎంపికై న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో
ఇద్దరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాలి శ్రీనివాసులు కథనం మేరకు.. 2021 డిసెంబర్ 6 తేదీ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగకు చెందిన వై.దొరస్వామి పశువుల పాక వద్ద ఉండగా వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగ హరిజనవాడకు చెందిన ఎం సూర్య అలియాస్ సూర్య గోపాల్, ఎం.చిన్నబ్బ ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వీధిలైట్లు విషయంపై గొడవ పడి అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో దొరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతను వెదురుకుప్పం పోలీసులకు ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
భూములు ఇవ్వలేం.. న్యాయం చేయండి


