సెల్‌ఫోన్.. చేతిలో ఉన్న విషం
సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి.


